Top 10 Philanthropists In India : ప్రముఖ వ్యాపారవేత్త, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ మరో సారి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఏడాది కాలంలో రూ.2,153 కోట్లను ఆయన దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేశారు. దీంతో ఎడెల్‌గివ్ హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో ఆయన మరోసారి తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. శివ్ నాడార్ భారత్‌లోని సంపన్నుల జాబితాలో, గౌతమ్ అదానీ(రూ.11.6 లక్షల కోట్లు), ముకేశ్ అంబానీ(రూ.10.14 లక్షల కోట్లు) తర్వాత రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. శివ్ నాడార్‌తో పాటు ఈ చిట్టాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. బజాజ్ కుటుంబం మూడో స్థానంలో ఉంది.
గతేడాది శివ్ నాడార్ రూ.2042 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనికంటే ఈ ఏడాది విరాళాలు 5శాతం పెరిగాయి. రెండో స్థానంలో నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ.407 కోట్లు విరాళం ఇచ్చారు. గతేడాది కంటే ఇది 8శాతం ఎక్కువ. ఇక ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో ఉన్న బజాజ్ కుటుంబం- రూ.352 కోట్లు విరాళం ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకుంది. ఇది గతేడాది కంటే 33 శాతం ఎక్కువ. నాలుగో స్థానంలో ఉన్న కుమార మంగళం బిర్లా కుటుంబం గతేడాది కంటే 17శాతం ఎక్కువగా రూ.334 కోట్లు సమాజ సేవ కోసం వెచ్చించింది. ఇక ఐదో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.330 కోట్లను సమాజసేవ కోసం విరాళంగా ఇచ్చారు. క్రితం సంవత్సరం కంటే ఇది 16శాతం ఎక్కువ.
కృష్ణ చివుకుల (7వ స్థానం), సుస్మిత-సుబ్రోతో బాగ్చి (9వ స్థానం) తాజాగా హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో టాప్ 10లో నిలిచారు. కాగా, హురున్ ఇండియా దాతృత్వ జాబితాలోని టాప్ 10 దాతలు మొత్తం రూ.4,625 కోట్లు విరాళం అందించినట్లు నివేదిక పేర్కొంది. వీరిలో ఆరుగురు విద్య కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చుపెట్టినట్లు తెలిపింది.
ఈ జాబితాలో రూ.5 కోట్లు కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వ్యక్తులు 203 మంది ఉన్నారని నివేదిక తెలిపింది. అయితే ఈ 203 మంది దాతల సగటు విరాళం విలువ రూ.71 కోట్లు నుంచి రూ.43 కోట్లకు పడిపోయింది. హురున్ 2023 లిస్ట్ ప్రకారం 119 దాతలు రూ.71 కోట్లు వితరణ చేశారు.
టాప్- 10 దాతలు వీరే
దాత | విరాళం | |
1. | శివ్ నాడార్ | రూ.2153 కోట్లు |
2. | ముకేశ్ అంబానీ | రూ.407 కోట్లు |
3. | బజాజ్ కుటుంబం | రూ.352 కోట్లు |
4. | కుమార మంగళం బిర్లా | రూ.334 కోట్లు |
5. | గౌతమ్ అదానీ | రూ.330 కోట్లు |
6. | నందన్ నీలేకని | రూ.307 కోట్లు |
7. | కృష్ణ చివుకుల | రూ. 228 కోట్లు |
8. | అనిల్ అగర్వాల్ | రూ.181 కోట్లు |
9. | సుస్మిత, సుబ్రోతో బాగ్చి | రూ.179 కోట్లు |
10. | రోహిణీ నీలేకని | రూ.154 కోట్లు |
చదువుపై మమకారం - ఆనందం కోసమే విరాళం: కృష్ణ చివుకుల - Krishna Chivukula Interview 2024