Trudeau Labels Canadian Security Officials Criminals : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన దేశ ఇంటెలిజెన్స్ అధికారులనే క్రిమినల్స్‌గా అభివర్ణించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఘటన నేపథ్యంలో భారత్- కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అతడి హత్య కుట్రలో భారత ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రులు సైతం భాగమైనట్లు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వీటిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్థులుగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.
"దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం- దాని ద్వారా తప్పుడు కథనాలు ప్రచురితమవడం చూశాను. అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలి. దీంతో వార్తా పత్రికలకు అత్యంత రహస్యమైన, తప్పుడు సమాచారం లీక్ కాకుండా అడ్డుకోగలం" అని ట్రూడో చెప్పారు.
కెనడాకు చెందిన 'ది గ్లోబ్ అండ్ మెయిల్' వార్తా పత్రిక ఇటీవల నిజ్జర్ హత్య గురించి ఓ కథనం వెలువరించింది. ఈ హత్యకు కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని, ఈ మేరకు కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని కెనడా ప్రభుత్వం తెలిపింది. భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ చెప్పలేదని- దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైనా అవి ఊహాజనితమని తెలిపింది.
ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతేడాది వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడం వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో దిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలపై బహిష్కణ వేటు వేసింది.