Broccoli Paneer Recipe : నేటి ఆధునిక కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారంలో మార్పులు, శారీరక శ్రమకు దూరంగా ఉండడం, ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వంటివి ఈ సమస్యకి ప్రధాన కారణాలను నిపుణులు చెబుతున్నారు. అయితే, వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించే వారు ఉదయం, సాయంత్రం వ్యాయామంతో పాటు ఆహారంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అప్పుడే శరీరంలో కొవ్వులు కరుగుతాయని అంటున్నారు.
అయితే, బరువు తగ్గాలనుకునే వారు మార్నింగ్ తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో అన్ని రకాల పోషకాలు అందేలా చూసుకోవాలి. ఎందుకంటే.. బ్రేక్‌ఫాస్ట్‌లో సరిగ్గా తినకపోతే లంచ్‌లో అధికంగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గలేరు. అయితే, మీ కోసమే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ని పరిచయం చేయబోతున్నాం. అదే బ్రకోలీ పనీర్ రెసిపీ. ఈ స్టోరీలో చెప్పిన విధంగా బ్రకోలీ పనీర్ రెసిపీ చేస్తే రుచి చాలా బాగుంటుంది. దీనిని రోజూ ఒక పూట తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందట. కాబట్టి, మీరు ఓసారి ఇలా ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు :
- బ్రకోలీ ముక్కలు - ఒక కప్పు
- పనీర్ ముక్కలు - అరకప్పు
- బటర్ సరిపడా
- నువ్వులు - ఒక టేబుల్‌స్పూను
- వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
- ఉప్పు - రుచికి సరిపడా
- మిరియాల పొడి - అర టేబుల్‌స్పూను
- ఉల్లిపాయ - ఒకటి
- అల్లం తరుగు - ఒక స్పూన్
తయారీ విధానం:
- ముందుగా స్టౌపై ఒక గిన్నె పెట్టుకుని నీళ్లను పోయండి. ఇందులో బ్రకోలీ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఆపై మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించుకోండి. తర్వాత బ్రకోలీ ముక్కలను గరిటెతో ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టుకుని కాస్త బటర్ వేసి కరిగించండి. ఆపై పనీర్ ముక్కలు వేసి స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేయండి.
- తర్వాత పనీర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- ఇప్పుడు అదే పాన్‌లో కాస్త బటర్ వేసి కరిగించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి తరుగు, అల్లం తురుము వేసి ఫ్రై చేయండి.
- ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న బ్రకోలీ ముక్కలు, పనీర్ ముక్కలు వేసి కలపండి. అలాగే నువ్వులు, మిరియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేయండి.
- అంతే.. ఇలా చేస్తే బరువు తగ్గించే బ్రకోలీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ. నచ్చితే మీరు కూడా ఓ సారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్" చేసేసుకోండి - టేస్ట్ సూపర్!