ప్రత్యేక కోర్టు తనకు విధించిన మరణశిక్షను సవాల్ చేస్తూ పాకిస్థాన్ మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వేసిన పిటిషన్ను లాహోర్ హైకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తులు సెలవుల్లో ఉన్నారని, దీంతో పూర్తి ధర్మాసనం అందుబాటులో లేదన్న కారణంతో అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ముషారఫ్ దరఖాస్తును ఆయన తరపు న్యాయవాదికి అప్పగించింది. జనవరి తొలి వారంలో మరోసారి వ్యాజ్యం దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు రిజిస్ట్రార్ సూచించినట్లు పాకిస్థాన్ పత్రిక డాన్ ప్రకటించింది.
తనపై వచ్చిన అన్ని ఆరోపణలు సహా ప్రత్యేక కోర్టు చేసిన దర్యాప్తునకు వ్యతిరేకంగా ముషారఫ్ దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యాలన్నింటిపై జనవరి 9న లాహోర్ హైకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
రాజ్యాంగ విరుద్ధం
ప్రత్యేక కోర్టు విధించిన శిక్ష అన్యాయమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు ముషారఫ్. తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయని తెలిపారు. దర్యాప్తు పూర్తి కాకుండానే ఆగమేఘాలమీద విచారణ చేపట్టి తీర్పు వెలువరించిందన్నారు.