భారత్‌తో కర్తార్‌పుర్ నడవా విషయంపై నేడు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని పాకిస్థాన్ తెలిపింది. భారత్ కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
"కర్తార్‌పుర్ నడవాకు సంబంధించి గురువారం భారత్‌తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం."
- మహ్మద్ ఫైసల్, పాక్ విదేశాంగ కార్యాలయం అధికార ప్రతినిధి
అంగీకారం కుదిరింది..!
భక్తులు, యాత్రికులు ఉదయం వచ్చి పాక్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను దర్శించుకుని సాయంత్రం తిరిగి స్వస్థలాలకు చేరుకునేలా భారత్-పాక్ ఓ అంగీకారానికి వచ్చాయని ఫైసల్ పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం 5,000 మంది యాత్రికులను పవిత్ర స్థలాన్ని సందర్శించేందుకు అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రుసుము చెల్లించాల్సిందే..!
ప్రతి సందర్శకుడు కచ్చితంగా 20 డాలర్లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుందని ఫైసల్ స్పష్టం చేశారు. ఒప్పందం కుదిరిన తరువాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. రుసుము వసూలు విషయంలో భారత్ వైఖరి భిన్నంగా ఉన్నప్పటికీ ఒప్పందంపై సంతకం చేయడానికి సన్నద్ధమైంది.
మేము సిద్ధం..
కేంద్రహోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి.. కర్తార్‌పుర్ కారిడార్ సమీపంలోని జీరో పాయింట్ వద్ద పాకిస్థాన్ అధికారులను సోమవారం కలిశారు. నడవా విషయంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి(నవంబరు12)కి ముందు కర్తార్‌పుర్ నడవా ప్రారంభించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.
ఇదీ చూడండి: పండుగ వేళ పసిడి పరుగు... రూ.39వేలకు చేరువలో...