మూడు రోజుల భారత పర్యటనను జపాన్ ప్రధానమంత్రి షింజో అబే రద్దు చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. పౌరసత్వ చట్ట సవరణపై ఈశాన్య భారతంలో తీవ్ర స్థాయి నిరసనలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
అసోం గువాహటిలో ఈనెల 15 నుంచి 17 వరకు వార్షిక ద్వైపాక్షిక సదస్సులో భాగంగా భారత్, జపాన్ ప్రధానులు భేటీ కావాల్సి ఉంది. అయితే.. గువాహటిలో భద్రతా పరిస్థితులు క్షీణించినందున భారత పర్యటను రద్దు చేసుకోవాలని అబే భావిస్తున్నట్లు జపాన్ మీడియా పేర్కొంది. వార్షిక సదస్సు నిర్వహణపై ఇరుదేశాలు చివరి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది.
పీఐబీ ట్వీట్‌తో మరింత బలం
వార్షిక సదస్సు జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేని సమయంలో పీఐబీ హిందీ ఓ ట్వీట్ చేసింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, జపాన్ ప్రత్యర్థి మంత్రితో ఉన్న ఫోటోను పెడుతూ.. డిసెంబర్ 16న మోదీ-అబేల భేటీకి ముందే వీరి సమావేశం జరిగిందని పేర్కొంది. పీఐబీ ట్వీట్‌తో అబే భారత పర్యటన రద్దు వార్తలకు బలం చేకూరినట్లయింది.
ఇదీ చూడండి: యూకే ఫలితాలు: బోరిస్ దూకుడు.. బ్రెగ్జిట్‌కే బ్రిటన్ ఓటు!