ఇరాక్‌లోని అగ్రశ్రేణి షియా మతాధికారి కోరిక మేరకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ. పార్లమెంట్ భవనంలో రాజీనామా లేఖను అందజేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
గత రెండు నెలల నుంచి నిరంతరంగా కొనసాగిన ఆందోళనలతో ఇరాక్ అట్టుడుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దేశ ప్రధాని రాజీనామా, ఇతర డిమాండ్లతో ప్రజలు నిరసన బాట పట్టారు. ఇప్పటిదాకా పోలీసులు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 400మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 వేల మందికిపైగా గాయపడ్డారు. ఈ నిరసనలు మరింత ఉద్ధృతం కాకుండా ఉండేందుకు.. చట్టసభ్యులు ప్రధానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కోరారు షియా మతాధికారి. దీంతో ప్రధాని మహ్దీ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
సంబరాలు...
దేశ ప్రధాని అదెల్ అబ్దెల్ మహ్దీ స్వయంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం... నిరసనకారుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. దేశ రాజధాని బాగ్దాద్ వీధుల్లో నిరసనలు ఆపేసి రోడ్లపై నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
"ఇది మా మొదటి విజయం, మిగతా డిమాండ్లను మేము నెరవేర్చుకుంటాం. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి శ్రమ వృథా కాలేదు. వారు గెలిచారు.''
- ఓ నిరసనకారుడు
చర్చలు జరపండి: అమెరికా
ఇరాక్ ప్రధాని అబ్దెల్ మహ్దీ రాజీనామా ప్రకటనపై పరోక్షంగా స్పందించింది అమెరికా. అక్కడి ప్రభుత్వ నేతలు.. నిరసనకారుల డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు జరపాలని కోరింది.
ఇదీ చూడండి : మలయాళీ కవి అక్కితంను వరించిన జ్ఞాన్‌పీఠ్ అవార్డ్