అమెరికాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాము అణుఒప్పందాన్ని ఉల్లఘించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తాము యురేనియం శుద్ధి ప్రక్రియను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రతి 60 రోజులకు అణు ఒప్పందానికి కట్టుబడటం తగ్గిపోతుంటుందని హెచ్చరించింది.
అదే సమయంలో, ఒప్పందాన్ని కాపాడటానికి చివరి నిమిషం వరకు చర్చల కోసం ప్రయత్నాలు చేస్తామని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్ డిప్యూటీ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్... యూరోపియన్ శక్తులతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల చివర్లో మంత్రివర్గ స్థాయి చర్చలు జరపాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.
బీ కేర్ ఫుల్..
ఇరాన్ అణుఒప్పందం ఉల్లంఘించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. బీ కేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు.
"ఇరాన్ తాజాగా ఓ హెచ్చరిక జారీ చేసింది. నూతన అణు ఒప్పందం లేకపోతే.. తమకు కావల్సినంత యురేనియం శుద్ధి చేస్తామని ఇరాన్ అధ్యక్షుడు రొహానీ ప్రకటించారు. బెదిరింపులు చేసిన వారితో జాగ్రత్త. వారు మరలా వచ్చి మమ్మల్ని దెబ్బకొడతారు మునుపెన్నడూ ఎవరూ కొట్టనంతగా." -డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చర్చిద్దాం... కాస్త ఓపిక పట్టండి..
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రొహానీతో శనివారం ఫోన్లో మాట్లాడారు. యూరోపియన్ దేశాలు, ఇరాన్ కలిసి జూలై 15లోగా చర్చలు పునఃప్రారంభించి ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుగొందామని అన్నారు.
పరిశీలిస్తున్నాం..
ఇరాన్... అణుఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్లు చేసిన ప్రకటనపై ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. ఇరాన్‌లోని తమ ప్రతినిధి తాజా పరిస్థితులను పరిశీలిస్తున్నారని, పూర్తి వివరాలతో నివేదికను వియన్నా ప్రధాన కార్యాలయానికి నివేదిస్తారని పేర్కొంది.
ఇదీ విషయం..
2015లో జరిగిన అణుఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగింది. అనంతర పరిణామాల్లో ఇరాన్‌పై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఇరాన్ యురేనియం శుద్ధీకరణ గురించి ప్రకటించింది.
అణుఒప్పందంలోని అంశాలను కాపాడటంలో యూరోప్ దేశాలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపించింది. మరికొద్ది గంటల్లో 3.67 శాతం కంటే ఎక్కువ సాంద్రత ఉన్న యురేనియం శుద్ధిని ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
అణ్వాయుధాల కోసం 90 శాతం కంటే ఎక్కువ సాంద్రత ఉన్న యురేనియం వాడతారు. కానీ తాము కేవలం ఇంధన అవసరాల కోసమే ఈ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఇరాన్ డిప్యూటీ విదేశాంగమంత్రి అబ్బాస్ వెల్లడించారు.
మే నెల నుంచి ఇంధన అవసరాల కోసం యురేనియం శుద్ధిని వేగవంతం చేసిన ఇరాన్.. ఒప్పందంలో సూచించిన దాని కంటే ఎక్కువగా నిల్వలను పెంచడం గమనార్హం.
ఇదీ చూడండి: ఓటమికి బాధ్యత వహిస్తూ సింధియా రాజీనామా