సామాజిక మాధ్యమాల నియంత్రణకు పాకిస్థాన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానం ఆసియా ఇంటర్నెట్ కోలేషన్(ఏఐసీ)కు ఆగ్రహం తెప్పించింది. ఏఐసీలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనల వల్ల పాక్‌లో సేవల్ని కొనసాగించడం కష్టతరమవుతుందని స్పష్టం చేసింది. వెంటనే నిబంధనల్ని సమీక్షించని పక్షంలో సేవల్ని నిలిపివేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
ఈ మేరకు ‘ఆన్‌లైన్ ముప్పు నుంచి పౌరుల పరిరక్షణ’కు సంబంధించిన నియమాలను ఉటంకిస్తూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఏఐసీ లేఖ రాసింది. పాకిస్థాన్ రూపొందించిన నిబంధనలు అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
భారీ జరిమానా...
పాక్ కొత్త నిబంధనల ప్రకారం సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం సంబంధిత అధికారులకు అనేక అధికారాలను కట్టబెట్టింది. నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేలితే భారీ జరిమానా విధించాలని, అవసరమైతే సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే అనుమానిత వినియోగదారుల డేటాను నియంత్రించే వెసులుబాటు కూడా అధికారులకు కల్పించింది.
సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఇస్లామాబాద్‌లో కార్యాలయాలను ప్రారంభించి.. డేటాను ఇక్కడి సర్వర్లలోనే స్టోర్ చేయాలని షరతు విధించింది.