ఇండోనేసియాలోని సులవేసి దీవిలో శుక్రవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 42కు చేరింది. భూకంపం ధాటికి పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమై.. వందలాది మంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోయారు.
స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు 7 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి 62 భవనాలు కుప్పకూలినట్లు ఇండోనేసియా డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూకంపం సంభవించడం వల్ల చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇప్పటివరకు 42 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఏజెన్సీ చీఫ్ డార్నో మజీద్ తెలిపారు. భవనాలు నేలమట్టమవడం వల్ల చాలా మంది చిక్కుకుపోయారని, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు చెప్పారు. డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు.
వెంటనే..
గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. 'రింగ్ ఆఫ్ ఫైర్'గా పిలిచే ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఇదీ చూడండి: 'అద్దం' నేర్పే వ్యాయామం- మరింత అందంగా శరీరం