'ప్రపంచంలో ఎక్కడికెళ్లినా భారతీయులుంటారు' అన్నది వాస్తవం. అందుకు తగ్గట్టుగానే ప్రపంచ దేశాల్లో భారతీయుల ప్రాతినిధ్యం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా.. 2019-20కి గానూ 38వేలమందికి పైగా భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు. అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 60శాతం ఎక్కువ.
ఆస్ట్రేలియా ప్రభుత్వం మొత్తం 2లక్షలమందికి పౌరసత్వం మంజూరు చేసింది. ఇందులో రికార్డు స్థాయిలో 38,209మంది భారతీయులు ఉన్నారు. ఆ తర్వాత బ్రిటీషర్లు(25,011), చైనీయులు(14,764), పాకిస్థానీలు(8,821) మంది ఉన్నారు.
ఇదీ చూడండి:- సమోసా దౌత్యం: మోదీ కోసం వంట చేసిన ప్రధాని
బహుళసాంస్కృతిక దేశమైన ఆస్ట్రేలియాకు పౌరసత్వం ఎంతో ముఖ్యమని ఆ దేశ ఇమ్మిగ్రేషన్-పౌరసత్వ వ్యవహారాల మంత్రి ఆలెన్ టుజ్డ్ వెల్లడించారు. పౌరసత్వం పొందిన వారు ఆస్ట్రేలియాలోని హక్కులు, స్వేచ్ఛ, చట్టాలను గౌరవిస్తున్నట్టు అంగీకరించినట్టేనని పేర్కొన్నారు.
2016 గణాంకాల ప్రకారం.. ఆస్ట్రేలియాలోని 6,19,164 మంది తాము భారతీయ వంశానికి చెందినవారిమని వెల్లడించారు. ఇది ఆ దేశ జనాభాలో 2.8శాతం. వీరిలోని 5,92,000మంది భారత్లో జన్మించారు.
ఇదీ చూడండి:- భారతీయ విద్యార్థికి ఆ వర్సిటీ నుంచి రూ.1.3 కోట్లు!