పాకిస్థాన్ చెబుతున్నట్లు జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ అదృశ్యమవ్వలేదని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. స్వయంగా పాకిస్థాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ కలిసి అజార్‌ను అత్యంత భద్రమైన ప్రదేశంలో దాచారని పేర్కొన్నాయి. పాక్‌లోని బహవల్‌పూర్‌లో ఓ బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో అజార్ సురక్షితంగా దాక్కొన్నట్లు తమకు సమాచారం ఉందని తెలిపాయి.
కంటితుడుపు చర్యలకు దిగిన పాక్..
పాక్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలా వద్దా అన్న అంశంపై ఆర్థికచర్యల కార్యదళం-ఎఫ్ఏటీఎఫ్ ఈ వారంలో కీలకనిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో కంటితుడుపు చర్యలకు దిగిన పాక్.. ఇటీవలే లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో 11ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైషే అగ్రనేత మసూద్ అజార్ కొంత కాలం నుంచి కనిపించట్లేదంటూ ప్రకటన చేసింది. మసూద్ అజార్ దేశం విడిచి పారిపోయాడంటూ పాక్ ఆర్థిక వ్యవహారాల మంత్రి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే పాక్ అందులో ఎలాంటి వాస్తవం లేదని.. ఎఫ్ఏటీఎఫ్ సమావేశం నేపథ్యంలో అజార్, అతడి కుటుంబసభ్యులను ఓ భద్రమైన ఇంట్లో దాచిపెట్టారని భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.