అధికారంలోకి వచ్చాక మహిళలకు పూర్తి రక్షణ కల్పించటం మా బాధ్యత అంటూ పదే పదే ప్రకటనలు చేస్తున్న తాలిబన్లు(Afghan Taliban).. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడి జైలులో శిక్ష అనుభవిస్తున్న అనేక మంది ఖైదీలను విడుదల చేశారు. అలా బయటకు వచ్చిన వారంతా తమకు జైలు శిక్ష వేసిన మహిళా న్యాయమూర్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వారి ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న(Afghan Crisis) వెంటనే 250 మంది మహిళా జడ్జీల్లో కొందరు దేశం విడిచి వెళ్లిపోగా అనేక మంది ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 15 న అఫ్గాన్ తాలిబన్ల వశమైన నాటి నుంచే మహిళా న్యాయమూర్తులపై పగ తీర్చుకునే ఉద్దేశ్యంతో తాలిబన్లు వారి గృహాలపై ముమ్మర దాడులు ప్రారంభించినట్లు ఐరోపాకు పారిపోయిన ఓ అఫ్గాన్ మహిళా న్యాయమూర్తి తెలిపారు. కాబుల్‌లోని తమ ఇంటికి ఐదారు మంది తాలిబన్లు(Taliban News) వచ్చి తన కోసం ఆరా తీసినట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడే ఉన్న సహోద్యోగులు తీవ్ర భయాందోళనల నడుమ జీవిస్తున్నట్లు వివరించారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ జడ్జీస్, మానవ హక్కుల సంస్థల సహకారంతో అఫ్గాన్‌లోని మహిళా న్యాయమూర్తుల్ని రక్షించటం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె వెల్లడించారు..
ప్రస్తుతం అఫ్గాన్‌లో 250 మంది మహిళా న్యాయమూర్తులు, సుమారు వెయ్యి మంది మహిళా మానవ హక్కుల కార్యకర్తల భవిష్యత్తు ప్రమాదంలో ఉందని అఫ్గాన్ మానవ హక్కుల కార్యకర్త హోరియా మోసాదిక్ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఖైదీలు.. మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారుల్నే లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతూ భయపెడుతున్నట్లు పేర్కొన్నారు.
బ్రిటన్ గత వారం తొమ్మిది మంది మహిళా న్యాయమూర్తులను సురక్షితంగా తరలించినట్లు తెలుస్తోంది. కాబుల్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తరువాత ప్రపంచ దేశాలు అఫ్గాన్‌లో ఉన్న మహిళా న్యాయమూర్తులు, మానవ హక్కుల కార్యకర్తల తరలింపునకు ప్రాధాన్యం ఇవ్వకపోవటమే ప్రస్తుత ప్రమాదకర పరిస్థితికి కారణమని పలు మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఇదీ చూడండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలకు 'ప్లాన్'.. కీలక పత్రాలు లీక్!