కరోనా.. ప్రస్తుతం ఈ పేరు వినగానే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో నానాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే ఇతర దేశాల్లో మాత్రం పెరిగిపోతున్నాయి. తాజాగా ఆస్ట్రియా రాజధాని ఇన్స్బర్క్లోని ఓ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న ఓ మహిళకు వైరస్ సోకినందుకు ఈ హోటల్‌ను నిర్బంధించారు అధికారులు.
అనంతరం ఆమె భర్తకూ వైరస్ సంక్రమించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వీరిరువురికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు.
స్పెయిన్‌లో...
స్పెయిన్‌లో 100 మంది ఇటలీ ప్రయాణికులను అధికారులు హోటల్ గదులకే పరిమితం చేశారు. ఇటలీలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇటలీకి చెందిన ఓ ప్రయాణికుడు ఇటీవల టెనెరెఫే హోటల్లో బస చేసిన కారణంగా వీరిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు వివరించారు.
ఇప్పటి వరకు స్పెయిన్‌లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు కేసులు విదేశీ పర్యటకుల్లోనే కావటం గమనార్హం.
ఇటలీలో ఇప్పటివరకు కరోనా ధాటికి ఏడుగురు మరణించారు. ఈ వైరస్ కారణంగా చైనాలో 2600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: 80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ