పాకిస్థాన్లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. రావల్పిండి పురానా కిలా ప్రాంతంలో ఉన్న వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన పురాతన దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 7.30 ప్రాంతంలో 10-15 మంది గుడిపై దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో ప్రధాన ద్వారం, మెట్లు, పైఅంతస్తు ధ్వంసమయ్యాయని తెలిపారు.
ఈ ఘటనపై నార్తర్న్ జోన్ ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) భద్రతా అధికారి సయ్యద్ రాజా అబ్బాస్ జైదీ చేసిన ఫిర్యాదు మేరకు నగరంలోని బిన్ని పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పురాతన దేవాలయంపై దాడికి పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గత నెలరోజులుగా ఆ గుడికి మరమ్మత్తులు, ఆధునికీకరణ పనులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ సూయిజ్: పాక్షికంగా కదిలిన 'ఎవర్ గివెన్'