కరోనా నేపథ్యంలో మాస్కులకు ఒక్కసారిగా ప్రాధాన్యం ఏర్పడింది. అయితే 'మాస్కులందు నేను చేసిన మాస్కులు వేరయా' అని నిరూపిస్తున్నాడు హాంకాంగ్‌కు చెందిన ఓ కాస్ట్యూమ్ డిజైనర్. వివిధ రకాల్లో ఎడ్మండ్ కాక్ తయారుచేసిన మాస్కులిప్పుడు విశేషంగా చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
వృత్తిరీత్యా థియేటర్ కాస్ట్యూమ్ డిజైనర్, నటుడైన 50 ఏళ్ల ఎడ్మండ్ కాక్కు ఇటీవల వైరస్ సోకింది. అయినా తనలో సృజనాత్మకత ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తూ.. కొత్తరకం మాస్క్‌లను తయారుచేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.
రకరకాల మాస్క్‌లు..
ఎడ్మండ్ తయారుచేసిన మాస్కులలో వేటికవే ప్రత్యేకతను చాటుకొంటున్నాయి. ఒకటి పర్యావరణానికి హాని చేయకూడదని సూచిస్తే, సీసీటీవీ కెమెరాలతో రూపొందించిన ఇంకొక మాస్క్ హాంకాంగ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరిస్తుంది. త్రీడీ విజువలైజేషన్‌తో కూడిన మరో మాస్క్.. ప్రస్తుత తరం ఆరోగ్య పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఇలా వేటికవే ప్రత్యేక సందేశాన్నిస్తున్నాయి.
సాధారణ వస్తువులతోనే..
అయితే ఈ మాస్కుల తయారీకి ఎలాంటి ప్రత్యేక మెటీరియల్‌ను వాడలేదంటున్నాడు ఎడ్మండ్. రోజూ మనం ఉపయోగించే సాధారణ వస్తువులతో పాటు.. మిగిలిపోయిన కాస్ట్యూమ్ డిజైన్ కటింగ్స్‌తో ఇలా చేశానంటున్నాడు.
'ఎలాంటి కళ అయినా మనం రోజూ చేసే పనులనుంచే ఉద్భవించిందని నేను భావిస్తాను. కరోనా వైరస్ కారణంగానే నేనీ ఫేస్ మాస్కులు తయారు చేయగలుగుతున్నాను. వైరస్‌కు సంబంధించిన అనేక చిత్రాలను చూశాక.. ఇలా విభిన్నంగా మాస్కులు తయారుచేయొచ్చు కదా అనిపించింది. అదే ఆలోచనతో ఈ కొత్తరకం మాస్కులకు తెరలేపాను.'
- ఎడ్మండ్ కాక్, థియేటర్ కాస్ట్యూమ్ డిజైనర్
ఇదీ చదవండి: ప్రపంచంలోనే ఖరీదైన మాస్క్.. ధరెంతో తెలుసా?