కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఓ వైపు ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే.. ప్రపంచ దేశాల అగ్రనేతలు మాటల యుద్ధంలో మునిగిపోయారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అడుగు ముందుకేసి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు ఇవ్వాల్సిన నిధులను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా మహమ్మారి ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందని ఆరోపిస్తూ.. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.
కరోనాను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించడానికి డబ్ల్యూహెచ్‌ఓ చాలా సమయం తీసుకుందని అగ్రరాజ్య విదేశాంగమంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. అదే సమయంలో వైరస్ తొలినాళ్లల్లో అమెరికాకు చైనా సహకరించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో చైనా వుహాన్‌లోని ఓ అనుమానాస్పద ల్యాబ్‌ను ప్రస్తావించారు.
"అక్కడ(వుహాన్)లో ఓ ల్యాబ్ ఉందని తెలుసు. అక్కడి మార్కెట్ల గురించి తెలుసు. వుహాన్ నుంచే వైరస్ పుట్టుకొచ్చిందనీ తెలుసు. వీటిని కిలిపితే ఎన్నో అనుమానాలు తలెత్తుతాయి. వీటన్నిటికి చైనా జవాబు చెప్పాలి."
- మైక్ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి.
ట్రంప్ నిర్ణయంపై ఆగ్రహం...
ట్రంప్ నిర్ణయంపై చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. వైరస్ కట్టడిలో డబ్ల్యూహెచ్‌ఓ కీలక పాత్ర పోషిస్తోందని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి జాఓ లిజియన్ పేర్కొన్నారు.
"ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని అరికట్టడానికి డబ్ల్యూహెచ్‌ఓ తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యంగా కరోనాపై పోరులో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థానం భర్తీ చేయలేనిది. అలాంటిది.. అమెరికా నిర్ణయం డబ్ల్యూహెచ్ఓపై చాలా ప్రభావం చూపనుంది. ఇది ప్రపంచ దేశాలతో పాటు అమెరికాకు కూడా నష్టమే. డబ్ల్యూహెచ్ఓకు మద్దతుగా నిలిచి అమెరికా తన బాధ్యతలను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం."
-- జాఓ లిజియన్, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి.
అయితే డబ్ల్యూహెచ్ఓకు సహాయం చేసేందుకు మరిన్ని నిధులు విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు జాఓ.
మరోవైపు ట్రంప్ నిర్ణయాన్ని ఐరోపా సమాఖ్య తప్పుపట్టింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో నిధులను నిలిపివేయడానికి ట్రంప్ వద్ద ఎలాంటి కారణాలు ఉండవని తెలిపింది. ఐకమత్యంగా ఉంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చింది.