అమెరికా చేస్తోన్న ఆరోపణలకు వ్యతిరేకంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కీలక వ్యాఖ్యలు చేశారు. అహంకార, నిందాపూరిత ఆరోపణల వల్ల సమస్యకు పరిష్కారం లభించదని... దీని వల్ల ఇతర దేశాల హక్కులు, ప్రయోజనాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు.
చైనాకు వ్యతిరేకంగా చేస్తోన్న ఆరోపణలకు అంతర్జాతీయ చట్టం ప్రకారం ఎలాంటి వాస్తవ ఆధారాలు లేవని వాంగ్ యీ పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తోన్న వారందరూ పగటికలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. వారందరూ అవమానాలపాలవుతారని అన్నారు.
"కరోనా వైరస్‌తో పాటు అమెరికాలో రాజకీయ వైరస్ కూడా ప్రబలుతోంది. చైనాను కించపరచడానికి ప్రతీ అవకాశాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. అమెరికాలోని కొందరు రాజకీయ నాయకులు ప్రాథమిక వాస్తవాలు వదిలేసి అబద్దాలు, కుట్రలు పన్నుతున్నారు. ఇది విచారకరం."
-వాంగ్ యీ, చైనా విదేశాంగ మంత్రి
ఇతర దేశాల మాదిరిగా చైనా కూడా వైరస్ బాధిత దేశమేనని అన్నారు వాంగ్ యీ. ఈ సమయంలో బహుపాక్షిక విధానాలే ప్రపంచాన్ని ఏకం చేస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని దేశాలు కలిసి కట్టుగా వైరస్‌పై పోరాడాలన్నారు.
'మరింత బలంగా మారుతాం'
అంతర్జాతీయ చట్టాలపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రపంచదేశాలకు సూచించారు వాంగ్ యీ. కొవిడ్-19 తర్వాత చైనా మరింత బలమైన దేశంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"ప్రపంచం మళ్లీ మునుపటిలా మారదు. చైనా ముందుకు సాగడం ఆపదు. చైనా సామాజిక వ్యవస్థ, ప్రభుత్వ సామర్థ్యాలకు కొవిడ్-19 ఓ పెద్ద పరీక్ష. ఈ పరీక్షలో చైనా స్థిరంగా నిలబడింది. ఓ బాధ్యతాయుతమైన దేశంగా నిరూపించుకుంది. కొవిడ్-19 తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా మారుతుంది. చైనా ప్రజలు ఐకమత్యంతో సామ్యవాదం పట్ల నమ్మకంతో పునరుత్తేజం వైపు అడుగులు వేస్తారు."
-వాంగ్ యీ, చైనా విదేశాంగ మంత్రి
ఇదీ చదవండి: హాంకాంగ్ వీధుల్లో మళ్లీ హోరెత్తిన నిరసనలు