నోటితో మాట్లాడుతూ... నొసటితో వెక్కిరించి నట్లు... భారత్‌తో ఒకవైపు శాంతి చర్చలంటూనే చైనా మరోవైపు తన సేనలను సరిహద్దుల్లో చురుగ్గా కదిలిస్తోంది. డ్రాగన్ దుడుకు చర్యలకు పాకిస్థాన్ వంత పాడుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీవోకే)లోని స్కర్దు వైమానిక స్థావరంలో చైనా ఇంధన విమానమొకటి మోహరించింది. ఆ దేశానికి చెందిన గస్తీ విమానాలూ ముమ్మరంగా తిరుగుతున్నాయి. ఇందుకు దీటుగా భారత్ చైనా సరిహద్దు పొడవునా అప్రమత్తమైంది. తన వైమానిక సంపత్తిని, క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఆదేశాలు అందిన 8 నిమిషాల్లోనే దాడికి మన యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నాయి. రెండు దేశాల పరస్పర యుద్ధ సన్నద్ధత వాతావరణంలో ఎప్పుడేం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. భారత్‌తో ఉన్న సరిహద్దుల చేరువలోకి చైనా తన పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను దించింది. జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేసి, లద్దాఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కొద్దిరోజులకే చైనా కుయుక్తులు మొదలైనట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తన వాయుసేనకు అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చేందుకు సన్నద్ధమైంది.
గల్వాన్‌లో డ్రాగన్ దాష్టీకం తర్వాత.. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆ అగ్నికి ఆజ్యం పోస్తూ పొరుగుదేశం పాకిస్థాన్ చలి కాచుకుంటోంది. భారత్‌పై పగ తీర్చుకునే చర్యల్లో భాగంగా చైనాకు సైనికపరంగా సహాయ సహకారాలు అందిస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని స్కర్దు వైమానిక స్థావరంలో చైనా వాయు సేనను అనుమతించింది. డ్రాగన్‌కు చెందిన రీఫ్యూయెలర్ విమానం ఐఎల్-76 ఈ స్థావరంలో తిష్ఠవేసింది. యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనం నింపడం దీని ప్రత్యేకత. ఇక చైనా గస్తీ విమానాలు సరిహద్దులో ముమ్మరంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. పీవోకేలోని వైమానిక స్థావరాలను చైనా వాయుసేన విస్తృతంగా ఉపయోగించొచ్చన్న అంచనాలతో చర్యలు చేపట్టింది. మన యుద్ధ విమానాలు, గగనతల రక్షణ వ్యవస్థలను సరిహద్దుల్లోకి తరలించింది. లద్దాఖ్‌కు భారీగా అదనపు బలగాలు, సరకులను సరిహద్దుల్లోకి రవాణా చేయడంలో భారత వాయుసేన విమానాలు బిజీగా ఉన్నాయి.
ఐఎల్-78 ఎందుకు?
టిబెట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చైనా వాయుసేనకు అనేక వైమానిక స్థావరాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం.. సముద్ర మట్టానికి 4వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. అక్కడ ఆక్సిజన్ లభ్యత తక్కువ. అందువల్ల అక్కడి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు ఎక్కువ బరువుతో టేకాఫ్ కాలేవు. ఫలితంగా తక్కువ ఆయుధాలు, ఇంధనంతోనే అవి పయనం కావాలి. దీనివల్ల అవి ఎక్కువ దూరం వెళ్లలేవు. పరిమిత స్థాయిలోనే దాడులు చేయగలవు. అందుకు భిన్నంగా భారత్‌లో వైమానిక స్థావరాలు పంజాబ్, హరియాణాలోని మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక్కడ్నుంచి యుద్ధవిమానాలు పూర్తి సామర్థ్యంతో ఇంధనం, ఆయుధాలను మోసుకెళ్లి, శత్రువుపై విరుచుకుపడగలవు. తన వైమానిక స్థావరాలు ఎత్తయిన ప్రాంతాల్లో ఉండటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందిని ఇంధన ట్యాంకర్ విమానాల ద్వారా అధిగమించాలని చైనా భావిస్తోంది. ఇవి యుద్ధవిమానాలకు గాల్లోనే ఇంధనాన్ని నింపుతాయి.
మనకు చేరువలోనే..
స్కర్దు వైమానిక స్థావరాన్ని పాక్ ఇటీవల బాగా విస్తరించింది. అది లేహ్‌లోని మన వైమానిక కేంద్రానికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. గత ఏడాది ఆగస్టులో పాకిస్థాన్‌కు చెందిన జెఎఫ్-17 యుద్ధవిమానాలు.. చైనాలోని హోటన్‌లో జరుగుతున్న యుద్ధవిన్యాసాల్లో పాల్గొనేందుకు వెళుతూ మధ్యలో ఇక్కడ ఆగాయి. ప్రస్తుతానికి స్కర్దులో పరిమిత స్థాయిలోనే చైనా కార్యకలాపాలు ఉన్నాయి. అయితే ఘర్షణ చోటుచేసుకుంటే పీవోకేలోని మరిన్ని వైమానిక స్థావరాలను పాక్.. డ్రాగన్‌కు ఇచ్చే అవకాశం ఉంది.
8 నిమిషాల్లోనే మన యుద్ధ విమానాలు సిద్ధం
చైనా వైమానిక దళంతో పోలిస్తే భారత వాయు సేన ఎక్కువ సంఖ్యలో యుద్ధవిమానాలను ఎల్‌ఏసీకి తరలించగలదు. మైదాన ప్రాంతాల్లో అనేక వైమానిక స్థావరాలు ఉండటమే ఇందుకు కారణం. తూర్పు లద్దాఖ్‌లోనే కాక చైనా వెంబడి ఉన్న సరిహద్దు ప్రాంతమంతటా భారత వైమానిక దళం తన అప్రమత్తతను కొనసాగిస్తోంది. ఆదేశం అందిన 8 నిమిషాల్లోనే దాడికి మన యుద్ధవిమానాలు సిద్ధంగా ఉన్నాయి. ఇరుకైన పర్వత మార్గాల్లో దాడి చేసే సామర్థ్యం మన పోరాట హెలికాప్టర్లకు ఉంది.
ఏమిటీ ట్యాంకర్ విమానం?
యుద్ధవిమానాల పోరాట పరిధిని పెంచడంలో ఇంధన ట్యాంకర్ విమానాలు సాయపడతాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ప్రధాన వైమానిక దళాలు వీటిని సమకూర్చుకుంటున్నాయి. యుద్ధవిమానం ఎక్కడ ఉన్నా.. ఇవి వెళ్లి గాల్లోనే వాటికి ఇంధనాన్ని నింపగలవు. చైనా 2005లో రష్యా నుంచి ఐఎల్-78 ఇంధన ట్యాంకర్ విమానాలను కొనుగోలు చేసింది. ఒక్కో విమానం దాదాపు 85 టన్నులకుపైగా ఇంధనాన్ని మోసుకెళ్లగలదు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన 'యుపాజ్-1' రీఫ్యూయెలింగ్ పాడ్ ద్వారా ఒక నిమిషంలోనే 3వేల లీటర్ల ఇంధనాన్ని అవతలి విమానంలోకి బట్వాడా చేయగలదు. భారత్ వద్ద కూడా ఆరు ఐఎల్-78 మిడాస్ ట్యాంకర్లు ఉన్నాయి. మరో ఆరింటిని సమకూర్చుకోవాలని మన దేశం యోచిస్తోంది.
అయినా మనదే పైచేయి..
భారత సరిహద్దుల వెంబడి ఉద్రిక్తతలు పెరగడంతో టిబెట్‌తోపాటు షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో చైనా తన వైమానిక దళాన్ని పెంచుతోంది. భారత్ కూడా సుఖోయ్-30ఎంకేఐ, మిగ్-29, జాగ్వార్ యుద్ధవిమానాలను ఇప్పటికే రంగంలోకి దించింది. భారత వైమానిక దళంతో పోలిస్తే చైనా వద్ద నాలుగు రెట్లు ఎక్కువగా ఫైటర్లు, బాంబర్లు ఉన్నాయి. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. యుద్ధం చెలరేగితే ఎన్ని యుద్ధవిమానాలను భారత్‌తో ఉన్న సరిహద్దుల్లోకి చైనా తీసుకురాగలదన్నది ముఖ్యమని పేర్కొన్నాయి. ప్రస్తుతం తూర్పు లద్దాఖ్‌కు దగ్గర్లో ఉన్న హోటన్ వైమానిక స్థావరంలో చైనా వైమానిక దళానికి చెందిన జె-11, జె-8, ఇతర యుద్ధవిమానాలు 35 నుంచి 40 వరకూ ఉన్నాయి. వీటికితోడు గగనతల ముందస్తు హెచ్చరికల విమానాలు, సాయుధ డ్రోన్లు ఉన్నాయి. అదనంగా ఇటీవల సుఖోయ్-27 యుద్ధవిమానాలు అక్కడ మోహరించాయి.
చైనా మార్షల్ ఆర్టిస్టులు
భారత్‌తో ఉన్న సరిహద్దుల చేరువలోకి పర్వతారోహకులు, మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లను చైనా దించింది. ఈ నెల 15న గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరగడానికి కొద్దిసేపటి ముందు వీరిని టిబెట్‌లోని లాసాకు పంపినట్లు చైనా సైనిక దినపత్రిక 'చైనా నేషనల్ డిఫెన్స్ న్యూస్' తెలిపింది.
గత ఏడాది సెప్టెంబర్‌లోనే బీజాలు..
లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న పాంగాంగ్ సరస్సు ఉత్తర రేవులో చైనా దురుసు వైఖరి నెలన్నర నుంచే ఉన్నట్లు కనపడుతున్నా దానికి సంబంధించిన తొలి సంకేతం గత ఏడాది సెప్టెంబర్ 11నే వెలువడింది. జమ్మూ-కశ్మీర్‌లో 370 అధికరణాన్ని రద్దు చేసి, లద్దాఖ్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన కొద్దిరోజులకే ఇది జరగడం గమనార్హం.
ఎల్‌ఏసీ వెంబడి గస్తీ నిర్వహణకు సంబంధించి భారత్, చైనాలు నిర్దిష్ట విధానాన్ని పాటిస్తుంటాయి. ఎల్‌ఏసీకి సంబంధించి తమ భావన మేరకు అవి గస్తీ నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలో అవతలి పక్షం దాన్ని వ్యతిరేకిస్తుంటుంది. అది తమ భూభాగమని చెబుతుంది. ఈ సమయంలో రెండు పక్షాలూ 10 నిమిషాల పాటు 'బ్యానర్ డ్రిల్' నిర్వహిస్తాయి. ఇది తమ భూభాగమని, వెనుదిరిగి వెళ్లిపోవాలని పరస్పరం బ్యానర్లు ప్రదర్శించుకుంటాయి. ఘర్షణ పడటం ఉండదు. పాంగాంగ్ సరస్సులోని 'ఫింగర్-8' వరకూ వెళ్లేందుకు భారత గస్తీ బృందానికి చైనా సైనికులు అనుమతించేవారు. అలాగే చైనా సైనికులు ఫింగర్ 4 వరకూ తమ వాహనాల్లో వస్తుంటారు. ఈ గస్తీ బృందాలను వాటి గమ్యస్థానానికి దగ్గర్లో అవతలి పక్షం నిలువరిస్తుంటుంది. అయితే పూర్తిగా అడ్డుకోవడం జరగదు.
గత ఏడాది సెప్టెంబర్ 10 తర్వాత పరిస్థితి మారిపోయింది. ఫింగర్ 8 వరకూ భారత బృందం వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకుంది. ఆ మరుసటి రోజున ‘ఫింగర్ 4’ వరకూ చైనా సైనికులు ఎనిమిది భారీ వాహనాల్లో రావడానికి ప్రయత్నించినప్పుడు ఉద్రిక్తతలు పెరిగాయి. ఘర్షణ జరిగింది.
దీంతో ఫింగర్ 8 వద్దకు కాలినడకన ప్రత్యామ్నాయ మార్గంలో చేరుకునేందుకు భారత బలగాలు చర్యలు చేపట్టాయి. దీనికి కూడా చైనా సైన్యం అడ్డు చెప్పడంతో గత నెల 5న అర్ధరాత్రి ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇందులో అనేక మంది గాయపడ్డారు. ప్రస్తుత సైనిక ప్రతిష్టంభనకు ఇదే మూల బిందువు అయింది.
ఇదీ చూడండి: చైనా విద్యుత్ పరికరాలతో సైబర్ దాడులు!