కరోనా వైరస్ దాదాపు ఆరు నెలలుగా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. ఎంత అదుపు చేసినా కొత్తకేసులు పుట్టుకొస్తున్నాయి. ఇక ఆ మహమ్మారికి భయపడి దాక్కునేది లేదని చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నాయి. అయితే, మళ్లీ కొత్త కేసులు పెరగడం వల్ల ఆయా ప్రభుత్వాలు ఆందోళనకు గురవుతున్నాయి.
సడలింపులు, బిగింపులు!
కరోనాకు కేంద్రబిందువుగా పరిగణిస్తున్న చైనాలో నెలరోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో లాక్డౌన్ ఎత్తివేసింది ప్రభుత్వం. కానీ, అంతలోనే వైరస్ వ్యాప్తి మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఆ దేశంలో లక్షణాలు లేని కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. తాజాగా 17 మంది ఈ వ్యాధి బారిన పడగా... వారిలో సగానికి పైగా ఈ తరహా బాధితులే ఉన్నారు. రెండో దశ కేసుల సంఖ్య 515కు చేరింది. జిలిన్ ప్రావిన్స్‌లో కొత్త కేసులు బయటపడటం వల్ల ఆ ప్రాంతాన్ని పూర్తిగా నిర్బంధించింది అక్కడి ప్రభుత్వం.
వుహాన్‌లో చేపట్టిన ఇంటింటి కరోనా పరీక్షల కార్యక్రమం కొనసాగుతోంది. రోజుకు 15 లక్షల మందికి న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహించే సామర్థం చైనాకు ఉందని ఆ దేశ ఆరోగ్య కమిషన్ పేర్కొంది.
మరోవైపు షాంఘై నగరంలో స్కూళ్లు తెరుచుకున్నాయి. బడికి రావడమా, ఆన్లైన్ క్లాసులు వినడమా అనేది విద్యార్థుల ఇష్టానికి వదిలిపెట్టి.. తరగతులు మొదలెట్టాయి పాఠశాలల యాజమాన్యాలు. విమానసేవలు పునః ప్రారంభమయ్యాయి. పర్యటక ప్రాంతాలు భౌతిక దూరం నిబంధనలతో తెరుచుకున్నాయి.
చైనాలో తొలిదశలో 82,942 మందికి కరోనా సోకగా... ఇప్పటికి 86 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. 78,227 మంది కరోనాను జయించారు. 4,633 మంది మృత్యువాత పడ్డారు.
కొరియా...
దక్షిణ కొరియాలో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మొన్నటిదాకా రోజుకు దాదాపు 30 కేసులు నమోదవగా.. గడిచిన 24 గంటల్లో కేవలం 13 కరోనా కేసులే వచ్చాయి.
కొరియా వ్యాధి నివారణ-నియంత్రణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా మొత్తం 11,050 కేసులు నమోదయ్యాయి. వీటిలో సియోల్ ఇటావాన్ జిల్లాలోని నైట్‌క్లబ్‌కు హాజరైన వారి నుంచి వ్యాపించిన కేసులే ఎక్కువ. ఇప్పటి వరకు 9,888 మంది కరోనా నుంచి విముక్తి పొందారు. 262 మంది వైరస్ బారినపడి మృతి చెందారు.
కేసులు పెరుగుతున్నా.. లాక్డౌన్ ఎత్తివేత!
పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లోనే 1,352 మంది వైరస్ బారిన పడ్డారు. కేసుల పెరుగుదలను లెక్కచేయకుండా లాక్డౌన్ ఎత్తేసింది పాక్ ప్రభుత్వం. దేశంలో చాలా చోట్ల వ్యాపార కార్యకలాపాలకు అనుమతిచ్చింది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం లాక్డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి.
దశలవారీగా.. విమాన సేవలను పునరుద్ధరించింది. పాక్ పంజాబ్‌లో ఈ వారంలో ప్రజారవాణా సేవలనూ ప్రారంభిస్తామని ప్రకటించింది. అఫ్గానిస్థాన్ సరిహద్దులను తెరిచి రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఒక్క శనివారం తప్ప.. వాణిజ్య ట్రక్కుల రవాణాకు ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేసింది.
పాక్‌లో ఇప్పటివరకు నమోదైన 40,451 కేసుల్లో.. అత్యధికంగా సింధ్, పంజాబ్ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని తెలిపింది పాక్ ఆరోగ్య శాఖ. 11,341 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 873 మంది వైరస్ బారినపడి ప్రాణాలు విడిచారు. గడిచిన 24 గంటల్లో 39 మృతి చెందారు.
ఇదీ చదవండి:ఆకాశంలో ఎగిరొచ్చిన కరోనా టెస్టింగ్ కిట్లు!