చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు
చైనాలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 49 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని బీజింగ్‌లోనే 36 కేసులు వెలుగు చూశాయి. విదేశాల నుంచి వచ్చిన వారు 10మంది కాగా హుబె ప్రావిన్సులో ముగ్గురికి వైరస్ పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే బీజింగ్ చుట్టుపక్కల మరో పది ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను ప్రకటించింది అక్కడి ప్రభుత్వం.
చైనాలో కరోనా కేసులు పెరగడం వల్ల అప్రమత్తమైన అధికారులు సామూహికంగా కరోనా పరీక్షలు ప్రారంభించారు. మే 30 నుంచి చైనాలోని జిన్‌ఫాడి మాంసం మార్కెట్‌ను సందర్శించిన 29,386 మందికి వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
177మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆ దేశ జాతీయ ఆరోగ్య అధికారులు తెలిపారు. 115మంది వైరస్ లక్షణాలు లేనివారు వైద్యుల పర్యవేక్షణలోనే నిర్బంధంలో ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం వైరస్‌తో 4,634 మంది మరణించగా... 83,181మంది వైరస్ బారిన పడ్డారు.