గల్వాన్ ఘర్షణలో చైనా వైపు 40 మంది సైనికులు మరణించారన్న భారత మాజీ సైనికాధిపతి వీకే సింగ్ వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆ దేశం నిరాకరించింది. తమ వద్ద ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ సోమవారం మీడియాతో మాట్లాడారు. "వివాద పరిష్కారానికి భారత్, చైనా మధ్య దౌత్య, సైనిక సంప్రదింపులు జరుగుతున్నాయి." అని స్పష్టం చేశారు. వీకే సింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా తన వద్ద సమాచారం లేదని తప్పించుకున్నారు.
మొదటి నుంచీ గోప్యంగా..
గల్వాన్ లోయలో జూన్ 15న సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణపై చైనా ఎటువంటి వివరాలు వెల్లడించటం లేదు. మృతులు, గాయపడ్డవారి సంఖ్యపై మొదటి నుంచి గోప్యతను పాటిస్తోంది. అయితే చైనా వైపున కూడా మరణాలు సంభవించినట్లు ఆ దేశానికి చెందిన అధికారిక పత్రికలు వెల్లడించాయి.
భారత్ చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభనపై జనరల్ వీకే సింగ్ శనివారం ఓ వార్తా ఛానల్‌తో మాట్లాడారు. "మనం 20 మంది సైనికులను కోల్పోయాం. చైనా వైపు ఇంతకు రెట్టింపు సంఖ్యలో చనిపోయారు." అని వ్యాఖ్యానించారు.
కొనసాగుతున్న చర్చలు..
తూర్పు లద్ధాఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించే మార్గాలపై చర్చించడానికి మరోసారి లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమవేశం జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మొదటిసారిగా జూన్ 6న జరిగిన భేటీలో ఇరు వర్గాలు సున్నితమైన ప్రాంతాల్లో వెనక్కుతగ్గాలని నిర్ణయించాయి. అయినప్పటికీ జూన్ 15న చైనా వైఖరి తీవ్ర ఘర్షణలకు దారితీసి 20 మంది భారత సైనికులు అమరులయ్యారు.
ఇదీ చూడండి: భారత సైనికుల దెబ్బకు పరిగెత్తిన చైనా జవాన్లు!