China Covid Strategy: గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా చైనాలో ఇప్పుడు కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రోజూ వందలాది మంది ప్రజలు.. వైరస్ బారిన పడుతున్నారు. జీరో టాలరెన్స్ విధానంతో ఇన్ని రోజులూ వైరస్‌ను కట్టడి చేస్తూ వచ్చిన డ్రాగన్ దేశం తాజాగా ఆ పద్ధతికి నెమ్మదిగా ముగింపు పలకాలని చూస్తోంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. డ్రాగన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకునే సమాధానాలు చెబుతోంది. ఇప్పటివరకు ఒక్క కొవిడ్ కేసు నమోదైనా నగరాలకు నగరాలు లాక్‌డౌన్ విధిస్తూ విస్తృతంగా కరోనా పరీక్షలను చైనా చేపట్టేది. తాజాగా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు డ్రాగన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Zero Tolerance Approach: జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు చైనాలో తగ్గడం లేదు సరికదా ఆర్థిక వ్యవస్థకు అపార నష్టం చేకూరుతోందని చైనా ఆలస్యంగా గుర్తించింది. అందుకే జీరో కొవిడ్ విధానాన్ని సవరించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సిన్లు వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయని చైనా వైద్యుడు జాన్ వెన్‌హాంగ్ అన్నారు. టీకాలు వైరస్‌ను బలహీన పరుస్తాయని తెలిపారు. వైరస్ కట్టడికి కీలకమైన వ్యాక్సిన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. జీరో టాలరెన్స్ విధానంపై చర్చించడం వల్ల ప్రయోజనం లేదని సూచించారు.
Stealth Omicron: చైనాలో కొవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమే కారణమని మరో వైద్యుడు యాన్‌జాంగ్ హాంగ్ అన్నారు. చైనాలో దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్లు వాడుతున్నారని తెలిపిన ఆయన.. అవి ఫైజర్ వ్యాక్సిన్లా సమర్థంగా పని చేయట్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గురువారం తీసుకున్న నిర్ణయం ఆసక్తిగా మారింది.
చైనాలో కరోనా మొదలైనప్పటి నుంచి విదేశీ విమానాలపై అక్కడ నిషేధం ఉంది. ఆ నిషేధాన్ని ఎత్తివేసి రాకపోకలకు అవకాశం ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. క్వారంటైన్ నిబంధనల్ని సైతం ఇది వరకు ఉన్న 21 రోజుల నుంచి ఒక వారానికి కుదించినట్లు తెలుస్తోంది. వైరస్ కట్టడికి డ్రాగన్ కొత్త పద్ధతిని పాటించాలని చూస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. దానిని డైనమిక్ జీరో కొవిడ్ పద్ధతి అని పిలుస్తున్నట్లు వెల్లడించారు. వైరస్‌ను వంద శాతం కట్టడి చేయడం సాధ్యం కాదన్న విషయం గ్రహించిన చైనా.. కేసులను తగ్గించేందుకు పూర్తి లాక్డౌన్లు కాకుండా వేరే మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. సంపూర్ణ లాక్‌డౌన్ల వల్ల.. ప్రజల ప్రాణాల్ని కొంత మేర డ్రాగన్ కాపాడినప్పటికీ.. అది ఆ దేశ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు. అందుకే చైనా జీరో టాలరెన్స్ విధానాన్ని ఎత్తివేయాలని చూస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా టెస్టుల కోసం చైనాలో జనం క్యూ- కొరియాలో రికార్డు మరణాలు