బిర్ తావిల్.. ఈజిప్ట్-సూడాన్ దేశాల మధ్య ఎర్ర సముద్రం దగ్గర్లో 2వేల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ప్రజలు నివసించడానికి అనువైన వాతావరణం ఉంది. కానీ నిర్మానుష్యంగా ఉంటుంది. ఖాళీగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఇరు దేశాలు వద్దని వదులుకుంటున్నాయి. ఇందుకు కారణం బ్రిటీష్ ప్రభుత్వం చేసిన 1899 నాటి ఒప్పందమే. సూడాన్‌పై పాలన విషయంలో యూకే, ఈజిప్ట్‌ల మధ్య 1899 జనవరి 19న 'సౌడన్' ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా సూడాన్‌లోని ఎర్ర సముద్రం తీర ప్రాంతాన్ని ఈజిప్టునకు అప్పగించారు. అయితే ఆరు నెలల తర్వాత ఒప్పందాన్ని సవరించి పాలన బాధ్యతను సూడాన్‌కే ఇచ్చారు. ఆ తర్వాత 1902లో యూకే ప్రభుత్వం ఇరు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎర్రసముద్రం తీరంలోని హలయాబ్ ట్రయాంగిల్ ప్రాంతాన్ని సూడాన్‌లోని బ్రిటీష్ గవర్నర్ పాలనలో ఉంచి.. దానిని ఆనుకొని ఉన్న బిర్ తావిల్ ప్రాంతాన్ని ఈజిప్ట్‌కు ఇచ్చారు.
ఈ విభజనను ఈజిప్ట్ ఒప్పుకోలేదు. 1899 ఒప్పందం ప్రకారం ఎర్రసముద్ర తీర ప్రాంతంలోని హలయాబ్ ట్రయాంగిల్ తమకే చెందుతుందని, బిర్ తావిల్ సూడాన్‌దేనని తేల్చిచెప్పింది. అయితే సూడాన్ మాత్రం యూకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సరిహద్దు ప్రకారం.. హలయాబ్ తమదేనని, బిర్ తావిల్ ఈజిప్ట్‌నకు చెందిందని వాదించడం మొదలుపెట్టింది. దీంతో రెండు దేశాల నేతలు హలయాబ్‌ను తమదిగా ప్రకటించుకున్నారు. ఈ ప్రాంతం కోసం ఘర్షణపడ్డారు. బిర్ తావిల్ మాత్రం తమది కాదంటే కాదంటున్నారు. ఎందుకంటే హలయాబ్ తీర ప్రాంతం. దీని వల్ల వాణిజ్య పరంగా లాభం ఉంటుంది. అదే బిర్ తావిల్ కాస్త ఏడారి ప్రాంతం. దీని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే ఇరు దేశాలు బిర్ తావిల్‌ను వద్దంటున్నాయి. అలా ఏ దేశానికి చెందని ప్రాంతంగా బిర్ తావిల్ ఉండిపోయింది.
బిర్ తావిల్ మాదేనన్న సామన్యులు
వర్జీనియాకు చెందిన జెరెమా హీటన్ అనే వ్యక్తి 2014లో బిర్ తావిల్ ప్రాంతాన్ని తనదేనని ప్రకటించుకున్నాడు. ఇందుకోసం ఈజిప్ట్‌కు చెందిన మిలటరీ అధికారుల నుంచి పలు అనుమతులు తీసుకున్నట్లు వెల్లడించాడు. కానీ అంతర్జాతీయంగా ఆ ప్రాంతానికి ఎలాంటి గుర్తింపు రాలేదు. అలాగే 2017లో భారత్‌కు చెందిన సుయాశ్ దీక్షిత్ అనే వ్యక్తి కూడా ఈ ప్రాంతాన్ని తన రాజ్యంగా ప్రకటించుకొని 'కింగ్‌డమ్ ఆఫ్ దీక్షిత్'గా నామకరణం చేశాడు. ఈ ప్రాంతానికి తనే ప్రధాన మంత్రి అని వెల్లడించాడు. అయితే అతడి ప్రతిపాదనను ఎవరూ గుర్తించలేదు. దీంతో ఇప్పటికీ ఆ ప్రాంతం ఎవరికీ చెందనిదిగానే ఉంది.
ఇలాంటివే మరికొన్ని..
- యూరప్‌లోని దునాబె నది తూర్పు తీరంలో ఉన్న కొన్ని ప్రాంతాలపై పట్టుకు సెర్బియా.. క్రోషియా దేశాల మధ్య శత్రుత్వం నడుస్తోంది. కానీ పశ్చిమ తీరంలోని గొంజ సిగ ప్రాంతాన్ని మాత్రం ఇరు దేశాలు స్వీకరించట్లేదు.
- అంటార్కిటికాలో కొంత ప్రాంతాన్ని కొన్ని దేశాలు తమవిగా ప్రకటించుకున్నాయి. కానీ మేరీ బైర్డ్ లాండ్‌ను మాత్రం ఏ దేశం తమదిగా ప్రకటించుకోలేదు. నిజానికి 1959 అంటార్కిటిక్ ఒప్పందం ప్రకారం ఒకప్పటి సోవియేట్ యూనియన్, యూఎస్ తప్ప ఏ దేశం ఇక్కడి ప్రాంతాలపై హక్కు సాధించలేదు.