సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, పెరుగుతున్న పెట్రోల్ ధరలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారైన సౌదీ అరేబియా, పెట్రోల్ ధరలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించాలని కోరింది.
ప్రపంచ ఆర్థిక వృద్ధి, ఒపెక్ దేశాలతో రష్యా సంబంధాలు, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తదితర కారణాల వల్ల అంతర్జాతీయంగా ఇంధన రేట్లు పెరిగాయి. గత నెలలో పెట్రోల్, డీజల్ ధరలు సుమారుగా రూ.2 వరకూ పెరిగాయి. పెరిగిన ఇంధన ధర నియంత్రణకు కేంద్ర ఇంధనశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ భారత్లో పర్యటిస్తున్న సౌదీ అరేబియా ఇంధనశాఖ మంత్రి ఖలీద్ అల్ ఫాలిగ్తోతో సమావేశమయ్యారు. చమురుధరల పెరుగుదల సమస్య పరిష్కారానికి కృషిచేయాలని కోరారు. సమావేశం అనంతరం, ప్రపంచ విపణిలో ఇంధన ధరల సమతుల్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సౌదీని కోరానని ప్రధాన్ ట్వీట్ చేశారు.
"ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగున్న నేపథ్యంలో, ఇంధన ధరలను సహేతుక స్థాయిలో ఉంచడానికి సౌదీ అరేబియా కృషిచేయాలని నేను కోరాను." -ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఇంధనశాఖ మంత్రి ట్వీట్
భారత విజ్ఞప్తికి సౌదీ ఇంధన మంత్రి ఎలా స్పందించారో ధర్మేంద్ర ప్రధాన్ చెప్పలేదు.