భారత్ సహా 91 దేశాలకు చెందిన వందల మంది పన్ను ఎగవేతదారులకు స్వర్గధామంగా మారిన పెట్టుబడి మార్గాలను నిర్మూలించాలని ఆక్స్ఫమ్ ఇండియా (Oxfam India ) పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ పాండోరా పేపర్స్ పేరిట (Pandora Papers ICIJ) రహస్య పత్రాలు విడుదల చేసిన నేపథ్యంలో ఈమేరకు కోరింది.
'అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల కూటమి' (ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్- ఐసీఐజే) (ICIJ News) తక్కువ పన్ను ఉన్న దేశాలకు పెద్దఎత్తున తరలించిన రహస్య సంపద, అక్రమ పెట్టుబడుల వివరాలను విడుదల చేసినట్లు పేర్కొంది. ఇందులో చాలామంది ప్రపంచస్థాయి నాయకులు ఉన్నట్లు తెలిపింది. సచిన్ తెందూల్కర్, అనిల్ అంబానీ, నీరవ్‌మోదీ లాంటి మొత్తం 300 మంది భారతీయులు ఈ జాబితాలో ఉన్నారు.
ఈ క్రమంలో మాట్లాడిన ఆక్స్‌ఫామ్ సీఈఓ అమితాబ్ బెహర్.. ప్రపంచంలో ఉన్న చీకటి మార్గాల ద్వారా డబ్బు సముద్రాలను దాటిపోతుందని అన్నారు. మొదటి నుంచి చెబుతున్నట్లుగా దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 427 బిలియన్ డాలర్లు చేతులు మారుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువగా డబ్బు కొరతను ఎదుర్కొంటున్నాయి. మరోపక్క సంపద కలిగిన ఎంతో మంది పన్ను ఎగవేత మార్గాల ద్వారా అంతకంతకూ సంపన్నులుగా మారుతున్నారు. వారు ఇలా చేయడం అనేది అవినీతికి, నేరాలకు ఊతం ఇచ్చినట్లుగా మారుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. దశాబ్దాలుగా పేదరికం మరింత పెరిగిపోతోంది.
- అమితాబ్ బెహర్, ఆక్స్‌ఫామ్ సీఈఓ
ఆ ట్రస్ట్ చట్టబద్ధమైంది...
మరోవైపు.. పాండోరా పేపర్స్‌లో తన భర్త పేరు ఉండడంపై స్పందించారు బయోకాన్ ప్రమోటర్ కిరణ్ మజుందార్ షా. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అభియోగాలపై సెబీ నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఒక వ్యక్తితో కలిసి తన భర్త ట్రస్టును నెలకొల్పారన్న ఆరోపణలను ఆమె కొట్టేశారు. ఆ ట్రస్ట్ పూర్తిగా చట్టబద్ధమైనది పేర్కొన్నారు. పాండోరా పేపర్స్ (Pandora Papers Leak) తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ఆరోపణలపై విచారణ...
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ (Pakistan Pm News) కేబినెట్‌లోని మంత్రులు, వారి కుటుంబాలు, ప్రధానికి సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులు రహస్యంగా కంపెనీలు, ట్రస్టులు పెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు పాండోరా పేపర్స్ (Pandora Papers Pakistan) విడుదల చేసిన రహస్య పత్రాల్లో తేలింది. ఈ జాబితాలో ఆర్థికమంత్రి సౌకత్ తారిన్, ఆయన కుటుంబం, ఇమ్రాన్ మాజీ సలహాదారుడు వకార్ మసూద్ ఖాన్ (రెవెన్యూ, ఆర్థికం) కుమారుడు సహా 700 మంది పాకిస్థానీలు ఉండగా... వారిపై వచ్చిన ఆరోపణలపై తప్పకుండా విచారణ జరపనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Pakistan Pm News) తెలిపారు.
నాకు అలాంటి లగ్జరీ ఇళ్లు లేవు..
అమెరికా, బ్రిటన్‌లో రహస్యంగా సుమారు రూ.741 కోట్లు విలువైన లగ్జరీ ఇళ్లు కొన్నట్లు వచ్చిన ఆరోపణలను ఖండించారు జోర్డాన్ రాజు అబ్దుల్లా-2. ప్రజాధనం అందులో ఉపయోగించలేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'పాండోరా పేపర్స్' లీక్.. ప్రముఖుల బాగోతాలు బట్టబయలు