లాహోర్‌లోని ఓ స్టేషన్‌పై దాడి చేసి 11 మంది పోలీసులను కిడ్నాప్ చేసిన నిషేధిత తెహ్రీక్-ఇ-లబైక్ పాకిస్థాన్(టీఎల్పీ) పార్టీ కార్యకర్తలు.. వారిని విడిచిపెట్టారు. అంతర్గత మంత్రిత్వ శాఖ మంత్రి షేక్ రషీద్.. పార్టీ వర్గాలతో తొలి విడత చర్చలు జరిపిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు.
చర్చలు విజయవంతంగా ముగిశాయని, ఆ తర్వాత నిరసనకారులు పోలీసులను విడిచిపెట్టారని రషీద్ స్పష్టం చేశారు. అనంతరం నిరసనకారులు రెహ్మతులిల్ అలమీన్ మసీదులోకి వెళ్లిపోయారని చెప్పారు. పోలీసు బలగాలను సైతం అక్కడి నుంచి వెనక్కి రప్పించినట్లు తెలిపారు. తదుపరి చర్చల్లో ఇతర సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్టీపై నిషేధం- ఘర్షణలు
టీఎల్పీ పార్టీపై పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధం విధించింది. గతవారం ఈ ప్రకటన వెలువడగా.. అప్పటి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్త నిరసనలకు దిగారు. ఆ పార్టీ నేత సాద్ హుస్సెయిన్ రిజ్విని అదుపులోకి తీసుకోవడం వల్ల.. ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు మరణించారు. వేల మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే.. ఆదివారం కొంతమంది దుండగులు లాహోర్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. డీఎస్పీ సహా 11 మంది పోలీసులను కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు.
ఇదీ చదవండి: ఈజిప్టు రైలు ప్రమాదంలో 11 మంది మృతి