అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో యువత తమ హవా చూపించనున్నారు. ఈ ఓటింగ్‌కు భారీ సంఖ్యలో యువత హాజరుకానున్నట్లు హార్వర్డ్ యూనివర్సిటీ రాజకీయ విభాగం నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయావకాశాలు గత కొద్ది నెలల్లో గణనీయంగా పెరిగాయని ఇదే సర్వేలో తేలింది.
దేశవ్యాప్తంగా 18-29 ఏళ్ల వయసున్న వ్యక్తులపై ఈ పోల్ నిర్వహించారు. ఎన్నికలపై వీరంతా అమితాసక్తి కనబర్చారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది 'తప్పక ఓటేస్తాం' అని చెప్పుకొచ్చారు. 2016 ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సర్వేలో 47 శాతం మంది మాత్రమే ఓటేస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో యువత ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని హార్వర్డ్ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. యువతలో ఉత్సాహాన్ని పరిశీలిస్తే 2020లో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
"యువ అమెరికన్లు తమ రోజువారీ జీవితంపై ప్రభావం చూపించే అంశాలైన వైద్యం, మానసిక ఆరోగ్యం, జాతి వివక్ష, సామాజిక న్యాయానికి సంబంధించిన సమస్యలకు బ్యాలెట్‌ను పరిష్కారంగా భావిస్తున్నారు. ఈ ఉత్సాహం వల్ల ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ గణనీయంగా పెరిగింది. ఇది చారిత్రాత్మక ఓటింగ్‌ను సూచిస్తోంది."
-మార్క్ గేరన్, హార్వర్డ్ కెన్నెడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ డైరెక్టర్
1984 తర్వాత 2008 ఎన్నికల్లోనే ఎక్కువ మంది యువత ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2008లో వీరి ఓటింగ్ శాతం 48.5గా నమోదైంది. ఈ సంవత్సరం యువత ఓటింగ్ శాతం 2008కి దగ్గరగా ఉంటుందని హార్వర్డ్ రాజకీయ విభాగం అంచనా వేస్తోంది.
బైడెన్ ముందంజ!
ఈ సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ 24 పాయింట్లతో ముందంజలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి యువ ఓటర్లలో బైడెన్‌కు మద్దతు 13 శాతం పెరిగింది.
బైడెన్ మద్దతుదారుల్లో 63 శాతం ఆయన గెలుస్తారని చెప్పగా.. ట్రంప్ గెలుస్తారని 6 శాతం మంది పేర్కొన్నారు. అదేసమయంలో.. ట్రంప్ మద్దతు దారుల్లో 74 శాతం మంది ప్రస్తుత అధ్యక్షుడే మళ్లీ గెలుస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 6 శాతం మంది బైడెన్ గెలుస్తారని తెలిపారు.
బైడెన్‌ను సానుకూలంగా చూస్తున్నవారి సంఖ్య 47 శాతంగా ఉంటే.. ప్రతికూలంగా చూస్తున్నవారి సంఖ్య 41 శాతంగా ఉంది. అయితే ఓటేస్తామని చెప్పినవారిలో మాత్రం బైడెన్ సానుకూలత 56 శాతంగా ఉంది.