ప్రపంచం ఇదివరకెన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. (UNGA 2021) విభజన, భయాలు అధికమయ్యాయని పేర్కొన్నారు. ఐరాస 76వ సర్వసభ్య సమావేశాన్ని (UNGA session 76)ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మానవ హక్కులను కాలరాస్తున్నారని, అణగారిన వర్గాల వారు మరింత దిగజారుతున్నారని అన్నారు. ప్రపంచం ఆపత్కాలంలో ఉన్న సమయంలోనే సంఘీభావ చర్యలు కొరవడుతున్నాయని అన్నారు. (UNGA session 2021)
"నేను ప్రమాద ఘంటికలు మోగించడానికే ఇక్కడికి వచ్చాను. ప్రపంచం మేల్కోవాలి. మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నాం. అగాధం చివరి అంచులో ఉన్నాం. ప్రపంచం మునుపెన్నడూ లేని విధంగా విడిపోయింది. మన జీవితంలో ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇది."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
కొవిడ్ టీకా పంపిణీలో అసమానతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గుటెరస్. కరోనా వ్యాక్సిన్‌ను వేగంగానే అభివృద్ధి చేసినప్పటికీ.. పంపిణీలో మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. అందరికీ టీకాలు అందించాలనేందుకు రాజకీయ సంకల్పం కొరవడిందని అన్నారు. ఇది అసభ్యకరమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. (UNGA session 2021)
"టీకాలను రికార్డు సమయంలో అభివృద్ధి చేసి మనం సైన్స్ టెస్ట్‌లో పాస్ అయ్యాం. కానీ నైతిక పరీక్షలో మాత్రం విఫలం అయ్యాం. కొన్ని దేశాల్లో కొవిడ్ టీకాలు మిగిలిపోతున్నాయి. మరోవైపు ఖాళీ గదులు కనిపిస్తున్నాయి. ధనిక దేశాల్లో మెజారిటీ జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. ఆఫ్రికాలో 90 శాతం మందికి టీకాలు వేయాల్సి ఉంది. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న నైతికపరమైన నేరం. ఇది అసభ్యకరం."
-ఆంటోనియో గుటెరస్, ఐరాస ప్రధాన కార్యదర్శి
అఫ్గానిస్థాన్, మయన్మార్ పరిస్థితులపై మాట్లాడారు గుటెరస్. సైనిక తిరుగుబాటులు, బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితులు మళ్లీ వచ్చాయని అన్నారు. అంతర్జాతీయ సమాజం మధ్య సరైన ఐకమత్యం లేకపోవడం వల్ల ఎవరికీ సాయం చేయలేకపోతున్నామని చెప్పారు. (UNGA session 2021)
వాతావరణ మార్పులపైనా ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్. ప్రతి ఖండం, ప్రతి ప్రాంతంలో దీనికి సంబంధించిన ప్రమాదకర సంకేతాలు వెలువడుతున్నాయని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, జీవవైవిధ్యాన్ని కోల్పోతున్నామని అన్నారు. గాలి, నీటి కాలుష్యం అధికమవుతోందని చెప్పారు. పారిస్ వాతావరణ ఒప్పందం అమలయ్యే అవకాశాలు కనుమరుగవుతున్నాయని వ్యాఖ్యానించారు. (UNGA session 2021)
'సరైన దారి ఎంచుకోవాలి'
మరోవైపు, ఇదే సమావేశంలో మాట్లాడిన ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్.. ప్రపంచం కీలక మలుపు వద్ద ఉందని అన్నారు. ప్రపంచం కరోనాతో పాటు, సంఘర్షణ, వాతావరణ మార్పులు వంటి సమస్యలను ఎదుర్కొంటోందని చెప్పారు. ఈ నేపథ్యంలో సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. (UNGA session 2021)
'ప్రచ్ఛన్న యుద్ధం కోరుకోవడం లేదు'
చైనాతో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా మరో ప్రచ్ఛన్న యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. ప్రపంచంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు.
రెండేళ్ల తర్వాత ప్రత్యక్షంగా ఈ సమావేశం జరుగుతోంది. సుమారు 100 మంది ప్రతినిధులు ప్రత్యక్షంగా ఈ మీటింగ్‌కు (UNGA session 2021) హాజరవుతుండగా.. మరికొందరు దేశాధినేతలు వర్చువల్‌గా పాల్గొంటున్నారు.
ఇవీ చదవండి: