అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. దక్షిణ కాలిఫోర్నియాలో మరికొన్ని ప్రాంతాలకు పాకింది. ఈ ప్రాంతంలో 68 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అగ్నికీలలు ఎగసిపడటం వలన 'రొనాల్డ్ రెగన్ ప్రెసిడెన్షియల్' గ్రంథాలయం మంటల్లో చిక్కుకుంది. దట్టమైన పొగలు వ్యాపించడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. తక్షణమే 800 మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
"తెల్లవారుజామున మ్యూజియంలోని కొంత భూభాగంలో మంటలు వ్యాపించాయి. దాదాపు 30 యార్డుల వరకు నాశనమైంది. తక్షణమే సహాయక సిబ్బంది రంగంలోకి దిగి హెలికాప్టర్ల సహాయంతో మంటలు ఆర్పారు. "
-మెలిస్సా గిల్లర్, గ్రంథాలయ ప్రతినిధి
జంతుజాతిని సురక్షిత ప్రాంతాలకు
కార్చిచ్చుకు జంతువులు బలికాకుండా.. సహాయక సిబ్బంది రక్షించారు. కాలిఫోర్నియాలో ఉన్న ఓ అశ్వశాలలో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు, సహాయక సిబ్బంది కలసి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
లాస్ ఏంజెలస్... సిమి వ్యాలి మధ్య చెలరేగిన కార్చిచ్చు ఇప్పటికే మొత్తం 1300 ఎకరాలకు పైగా విస్తరించింది. ఈ మంటల్లో 6500 ఇళ్లు కాలిపోయాయి.
ఇదీ చూడండి : ఇళ్లు ఖాళీ చేసి సినీ, క్రీడా ప్రముఖుల పరుగులు