సౌర కుటుంబంలోకి కొత్తగా ఒక భారీ తోకచుక్క ప్రవేశించిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర కుటుంబం శివార్లలో ఉన్న ఈ ఖగోళ వస్తువు.. వేగంగా లోపలికి దూసుకొస్తోందని చెప్పారు. ఒక నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడినప్పుడు మిగిలిపోయిన శకలాలే ఈ తోకచుక్కలు.
తాజాగా వెలుగులోకి వచ్చిన తోకచుక్కకు ' 2014 యూఎన్271' అని పేరు పెట్టారు. ఇది సూర్యుడి దిశగా మరింత చేరువై, 2031 నాటికి శని గ్రహ కక్ష్యలోకి ప్రవేశించొచ్చని భావిస్తున్నారు. ఈ తోకచుక్క వెడల్పు 100 నుంచి 370 కిలోమీటర్ల మధ్య ఉండొచ్చని అంచనా.
సాధారణ తోకచుక్క కన్నా చాలా పెద్దగా ఉంది. అది ఒక మరుగుజ్జు గ్రహమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే సూర్యుడి దిశగా మరింత చేరువైనప్పుడు అందులో తోక చుక్క లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. 2014లో తొలుత దీన్ని పరిశీలించినప్పుడు ఈ భారీ తోకచుక్క సూర్యుడి నుంచి 29 ఆస్ట్రోనమనికల్ యూనిట్లు(ఏయూ) దూరంలో ఉంది. సూర్యుడి నుంచి భూమి మధ్య ఉన్న దూరాన్ని 1 ఏయూ(సుమారు 15కోట్ల కిలోమీటర్లు)గా పేర్కొంటారు. ప్రస్తుతం ఆ తోకచుక్క 22 ఏయూల దూరంలో ఉంది. అంటే.. నెప్యూన్ గ్రహంతో పోలిస్తే అదే భూమికి దగ్గరగా ఉంది. గతంలో 'ఓమువామువా' అనే ఒక ఖగోళవస్తువు.. గంటకు 92వేల కిలోమీటర్ల దూరంతో ప్రయాణిస్తూ సౌర కుటుంబంలోకి ప్రవేశించింది. అయితే 2017లో అది సౌరకుటుంబాన్ని వీడింది.
ఇదీ చదవండి: బెజోస్ స్పేస్ టూర్‌పై వింత పిటిషన్- వేల మంది మద్దతు