అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రస్థానం కట్టుదిట్టమైన భద్రత నడుమ మొదలుకానుంది. ప్రధాన రహదారుల మూసివేత, ముళ్ల కంచెలు, సాధారణ పోలీసులే కాక సుమారు 25వేల మందికి పైగా సైన్య సిబ్బంది.. ఇవీ ఆయన ప్రమాణ స్వీకారం వేళ కనిపిస్తోన్న దృశ్యాలు.
గంభీర వాతావరణంలో..
జనవరి 6 పరిణామాల అనంతరం మరిన్ని ఘటనలు జరిగే అవకాశం ఉందనే నివేదికలు అందుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. క్యాపిటల్ హిల్ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు.. పెన్సిల్వేనియా, శ్వేతసౌధం చుట్టూ ఎత్తైన బారికేడ్ల ఏర్పాటు, వాషింగ్టన్ డీ.సీ. వంటి ముఖ్య ప్రాంతాల్లో అత్యున్నత మార్షల్స్ మోహరింపు చేపట్టారు. నిరంతర పర్యవేక్షణతో పాటు.. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యే సాధారణ పౌరులకు అనుమతి నిరాకరణ వంటి చర్యలతో అక్కడ గంభీర వాతావరణం నెలకొంది.
ఇదీ చదవండి: బైడెన్ ప్రమాణం- వాషింగ్టన్లో భద్రత కట్టుదిట్టం
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు భిన్నంగా ఉన్నాయి. అయితే భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిజానికి ఈ ముళ్లతీగల మధ్య ప్రమాణస్వీకార కార్యక్రమం జరగడం మాకిష్టం లేదు. వీధుల్లో ఆర్మీ దళాల మోహరింపు సైతం ఇబ్బందిగా ఉంది.
- మ్యూరియెలస్ బౌసర్, వాషింగ్టన్ డీ.సీ. మేయర్
ప్రమాణ స్వీకార సమయంలో ట్రంప్ మద్దతుదారులు హింసకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయన్నారు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ముఖ్యంగా అంతర్గత భద్రతాధికారుల నుంచే ముప్పు పొంచి ఉందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు.
అనుమానాస్పద కదలికలు..
ఇప్పటికే వాషింగ్టన్ డీ.సీ. ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు.. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వర్జీనియాకు చెందిన 22 ఏళ్ల వ్యక్తి నుంచి ఒక తుపాకీ సహా.. 3 మ్యాగజీన్‌లు, 37 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో పోలీసు అధికారిలా నటించిన ఓ మహిళనూ అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ తీరు సిగ్గుచేటు..
ఇక క్యాపిటల్ భవనం వద్ద హింస చెలరేగేలా ట్రంప్ వ్యవహరించిన తీరు అమెరికా ప్రతిష్టను దిగజార్చేలా ఉందన్నారు లీడ్ హౌస్ అభిశంసన నిర్వాహకుడు జామీ రాస్కిన్. ఇక ఈ వివాదంలో ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మౌనం వహించారని.. టీవీ చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్.. బైడెన్ గెలుపు ధ్రువీకరణ సమావేశానికి మైక్ పెన్స్ అధ్యక్షత వహించారు.
ఇదీ చదవండి: బైడెన్ ప్రమాణానికి సొంత సిబ్బంది నుంచే ముప్పు!