Covid test on flight US: డిసెంబర్ 20.. ఓ విమానం చికాగో నుంచి ఐస్లాండ్కు బయలుదేరింది. విమానంలో మొత్తం 150మంది ప్రయాణికులు ఉన్నారు. మార్గం మధ్యలో మారిసా ఫోటీయో అనే స్కూల్ టీచర్‌కు గొంతు నొప్పి మొదలైంది. దీంతో ప్రయాణంలోనే ఆమెకు కొవిడ్ పరీక్షను సిబ్బంది నిర్వహించారు. ఆ పరీక్షలో.. మారిసాకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది.
ఆ విమాన ప్రయాణం మొత్తం సమయం ఆరు గంటలు. ప్రయాణం మొదలైన గంటలోపే.. మారిసాకు పాజిటివ్ అని తేలింది. దీంతో మారిసా.. తన సీటును వదిలేసి బాత్రూంకు వెళ్లిపోయింది. స్వీయ నిర్బంధం కోసం దాదాపు ఐదు గంటల పాటు ఆమె బాత్రూంలోనే ఉండిపోయింది. తన పరిస్థితిని వివరిస్తూ.. టిక్‌టాక్ వీడియో రూపొందించింది.
"విమానంలో 150మంది ఉన్నారు. నాకు పాజిటివ్ అని తేలడం కన్నా.. నా నుంచి వారికి కొవిడ్ సోకుతుందేమో అన్న భయం ఎక్కువగా ఉండేది. అందుకే బాత్రూంకు వెళ్లిపోయాను. అయితే విమాన సిబ్బంది నన్ను బాగా చూసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే.. నాకు 'వీఐపీ క్వారంటైన్' ఏర్పాట్లు చేశారు. ఆహారం, డ్రింక్స్ అన్ని అందించారు. నా ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు," అని మారిసా వివరించింది.
Iceland covid rules: సాధారణంగా.. ఐస్లాండ్లో ప్రయాణించాలంటే.. 72గంటల ముందు కొవిడ్ పరీక్షకు సంబంధించిన రిపోర్టు ఉండాల్సిందే. మరి విమానం ఎక్కే ముందు.. మారిసా ఎప్పుడు పరీక్ష చేయించుకున్నారు? అన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. విమానం దిగిన వెంటనే ఆమె ఓ హోటల్లో క్వారంటైన్లోకి వెళ్లింది. తాజాగా.. ఆమెకు శుక్రవారం కొవిడ్ నెగిటివ్ రిపోర్టు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి:- 3 నెలలు ఎయిర్‌పోర్ట్‌లోనే నివాసం.. నిర్దోషిగా బయటకు...