US Troops in Europe: ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసే అవకాశముందన్న భయాల నేపథ్యంలో ఐరోపాకు 2000 మంది సైనికులను పంపినట్లు అమెరికాలోని పెంటగాన్ తెలిపింది. జర్మనీ, పోలాండ్ దేశాలకు వారిని తరలించినట్లు వెల్లడించింది. వెయ్యి మంది సిబ్బందిని జర్మనీ నుంచి రొమేనియాకు తరలించినట్లు పేర్కొంది.
అయితే అమెరికా దళాలు ఇప్పటివరకు ఉక్రెయిన్లో అడుగు పెట్టలేదని.. పరిస్థితులు బట్టి భవిష్యత్లో మెహరించే అవకాశముందని పెంగాన్ ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా నిరంతరం బలగాలను మోహరిస్తుందని ఈ నేపథ్యంలో మిత్ర దేశాలకు భరోసా ఇవ్వడం కోసమే సైనికులను పంపినట్లు తెలిపారు.
పుతిన్ తీవ్ర ఆరోపణలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ఈ ఘర్షణను వాడుకోవాలని అమెరికా యత్నిస్తోందన్నారు. నాటో విషయంలో రష్యాలో నెలకొన్న ఆందోళనలను అమెరికా విస్మరిస్తోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. హంగేరి ప్రధాని విక్టోర్ ఆర్బాన్‌తో పుతిన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పుతిన్ "ఉక్రెయిన్ భద్రతపై అమెరికాకు పెద్దగా ఆందోళన లేనట్లు ఉంది. కానీ, రష్యా అభివృద్ధిని అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. తన లక్ష్యం చేరుకోవడానికి ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటోంది. ఇప్పుడు ఉక్రెయిన్‌ను నాటోలో చేరనిస్తే.. తర్వాత అది మిగిలిన దేశాలను కూడా యుద్ధంలోకి లాగుతుంది" అని పేర్కొన్నారు.
మరోపక్క మంగళవారం అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ ఉక్రెయిన్ సంక్షోభంపై స్పందించారు. "ఎవరికి ఉపయోగపడని ఈ వివాదాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాం" అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో రష్యా దాదాపు లక్షమంది సైనికులను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని క్రిమియాను ఆక్రమించిన ఎనిమిదేళ్ల తర్వాత రష్యా ఈ చర్యలకు దిగింది.
ఇదీ చూడండి: Ukraine Crisis 2022: 'అమెరికా, నాటో మా డిమాండ్లను విస్మరించాయి'