భారత నౌకాదళ పోరాట సామర్థ్యం మరింత పటిష్ఠమైంది. అమెరికా నుంచి అధునాతన ఎంహెచ్-60 రోమియో (ఆర్) బహుళ ప్రయోజన హెలికాప్టర్లు మన అమ్ములపొదిలో చేరాయి. అమెరికాలోని శాన్‌డియెగోలో జరిగిన ఒక కార్యక్రమంలో లాంఛనంగా రెండు హెలికాప్టర్లను భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధుకు అమెరికా నౌకాదళ అధికారులు అందజేశారు.
ప్రపంచంలోనే శక్తిమంతం
'ఎంహెచ్-60ఆర్'లు నాలుగోతరం నేవీ హెలికాప్టర్లు. ఈ శ్రేణిలో ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనవిగా గుర్తింపు పొందాయి. భారత నౌకాదళంలో కాలం చెల్లిన 'సీ కింగ్' హెలికాప్టర్ల స్థానంలో ఇవి సేవలు అందించనున్నాయి.
ఆయుధాలు:
హెల్‌ఫైర్ క్షిపణులు, ఏటీకే మార్క్ 50, 46 టోర్పిడోలు, 7.62 ఎంఎం మెషీన్ గన్.
అడుగడుగునా అధునాతనం:
సరికొత్త ఏవియానిక్స్, సెన్సర్లు ఈ హెలికాప్టర్ సొంతం. పైలట్లు సులువుగా నిర్వహించేలా కాక్‌పిట్‌ను ఆధునిక సాధనాలతో తీర్చిదిద్దారు. ఇందులో కలర్ మల్టీ ఫంక్షన్ డిస్‌ప్లేలను పెట్టారు. నైట్ విజన్ గాగుల్స్ ద్వారా రాత్రివేళ కూడా ఈ స్క్రీన్‌లను వీక్షించొచ్చు. సూర్యకాంతిలోనూ స్పష్టంగా కనిపించేలా ప్రత్యేకంగా రూపొందించారు. శత్రు క్షిపణి దాడిపై హెచ్చరిక చేసే వ్యవస్థ, మల్టీ మోడ్ రాడార్, సోనార్, ఇన్‌ఫ్రారెడ్ జామర్ వంటి అనేక సెన్సర్లు ఇందులో ఉన్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ హెలికాప్టర్లను రక్షణ వర్గాలు 'రోమోయో'లుగా పిలుస్తుంటాయి.
జలాంతర్గాములకు చుక్కలే:
ఎంహెచ్-60హెలికాప్టర్.. శత్రు జలాంతర్గాములకు చుక్కలు చూపించనుంది. మన నౌకాదళంలోని సముద్రగస్తీ విమానం పి-8ఐ, సీ గార్డియన్ డ్రోన్లతో కలిసి ఇది భారత జలాలను శత్రు దుర్భేద్యంగా మార్చనుంది.
శత్రు యుద్ధనౌకలపై పోరు, ప్రత్యేక బలగాల తరలింపు, యుద్ధనౌకల్లోకి సరకుల రవాణా, గాలింపు, సహాయ చర్యలు, పోరాటంలో గాయపడినవారిని తరలించడానికీ ఈ హెలికాప్టర్లు ఉపయోగపడతాయి.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా జలాంతర్గాముల కదలికల నేపథ్యంలో ఈ హెలికాప్టర్లు మనకు అవసరమయ్యాయి.
- భారత్ కొనుగోలు చేస్తున్న హెలికాప్టర్లు: 24
- కాంట్రాక్టు ధర: 260 కోట్ల డాలర్లు
- తయారీదారు: సికోర్‌స్కీ-లాక్‌హీడ్ మార్టిన్ (అమెరికా)
- ఇంజిన్లు: రెండు (టర్బోషాఫ్ట్)
- గరిష్ఠ వేగం: గంటకు 267 కిలోమీటర్లు
- బరువు: 6,895 కిలోలు
- గరిష్ఠ టేకాఫ్ బరువు: 10,659 కిలోలు
ఇదీ చదవండి: 15 రోజుల్లో 16 మంది అనుమానాస్పద మృతి!