అమెరికా వెళ్లాలని కలలుగనే వేలాదిమంది భారతీయ ఐటీ నిపుణులకు పెద్ద ఉపశమనం లభించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వానికి షాకిస్తూ.. హెచ్-1బీ వీసాలపై తాత్కాలిక నిషేధం నిలిపివేస్తూ ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తన రాజ్యాంగ అధికారాలను దాటి ప్రవర్తించారని వ్యాఖ్యానించారు జడ్జి. విదేశీయుల ఉపాధికి సంబంధించిన దేశీయ విధానాన్ని రూపొందించేందుకు అధ్యక్షుడికి అపరిమిత అధికారాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
కామర్స్, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలకు వ్యతిరేకంగా అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్, జాతీయ తయారీ దారుల సంఘం, జాతీయ రిటైల్ ఫెడరేషన్, టెక్నెట్ వంటి సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టి.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు కాలిఫోర్నియాలోని ఉత్తర జిల్లా జడ్జి జెఫ్రే వైట్.
" దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, వృద్ధి, నూతన ఆవిష్కరణలకు అవసరమైన ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అడ్డుగా ఉన్న వీసా ఆంక్షలపై ప్రస్తుత ఆదేశాలు మేలు చేస్తాయి. నూతన ఆవిష్కరణలకు తోడ్పడేలా అగ్రశ్రేణి ప్రతిభావంతులను తయారు చేసేందుకు మిగతా ప్రపంచంతో పోటీ పడుతున్నాం. వీసాలపై కోర్టు నిర్ణయం అమెరికాలో ఆవిష్కరణకు కట్టుబడి ఉన్న తయారీదారులకు తాత్కాలిక విజయం. దీర్ఘకాలిక విజయం కోసం వలస చట్టాల్లో తగిన సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికి విధాన రూపకర్తలు అవసరం."
- జాతీయ తయారీ దారుల సంఘం.
కరోనా సంక్షోభం నేపథ్యంలో నిరుద్యోగితను తగ్గించేందుకని పేర్కొంటూ ఈ ఏడాది జూన్లో హెచ్-1బీ వీసాల జారీపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వాటితో పాటు హెచ్-2బీ, జే,ఎల్ వీసాలపై ఈ ఏడాది చివరి వరకు ఆంక్షలు విధించారు. అధ్యక్షుడి నిర్ణయాన్ని పలు ఐటీ సంస్థలు, ఇతర అమెరికా కంపెనీలు వ్యతిరేకించాయి.
ఇదీ చూడండి: హెచ్-1బీ వీసాదారులకు అమెరికా బంపర్ ఆఫర్