అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్లే లక్ష్యంగా వైమానిక దాడి ప్రారంభించిన అమెరికన్ మిలిటరీ అధికారులు... కొద్ది గంటల్లోనే 'శాంతి ఒప్పందం' ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని కాంగ్రెస్‌కు తెలిపారు. అయితే తాలిబన్లలో ఎక్కువ మంది యూఎస్-తాలిబన్ ఒప్పందానికి కట్టుబడే ఉన్నట్లు పేర్కొన్నారు.
"యూఎస్, సంకీర్ణ దళాలపై దాడులు చేయకుండా తాలిబన్లు శాంతి ఒప్పందాన్ని గౌరవిస్తున్నారు. అయితే వారు హింసను తగ్గించే పద్ధతులు అవలంబించడం లేదు. తాలిబన్లలోనూ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒకరు శాంతిని కోరుకుంటుంటే, మరొకరు హింస వైపు మొగ్గుచూపుతున్నారు. నిజానికి ఈ విషయంలో తాలిబన్లు కూడా చాలా సవాళ్లు ఎదుర్కొంటున్నారు."
- మార్క్ ఎస్పర్, అమెరికా రక్షణమంత్రి
గంటల వ్యవధిలో 'శాంతి'కి తూట్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్ నాయకుడితో మంగళవారం మాట్లాడారు. తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని, హింసను విడనాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే తాలిబన్లు అఫ్గాన్ భద్రతా దళాలపై దాడులు చేసి 20 మందిని బలిగొన్నారు. దీనితో రంగంలోకి దిగిన అమెరికా సైన్యం.. తాలిబన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. దీని ద్వారా అమెరికా... గత రెండు రోజులుగా అఫ్గాన్లపై పెరిగిన దాడులు తమకు ఆమోదయోగ్యం కాదని తాలిబన్లకు స్పష్టమైన సందేశం పంపింది.
ఇదీ చూడండి: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు చైనా వైద్యుల సలహాలు