ట్రంప్ హయాంలో పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా, తాజాగా మళ్లీ ఒప్పందంలో చేరింది. 107 రోజుల అనంతరం మళ్లీ శుక్రవారం అధికారికంగా ఈ ఒప్పందంలో చేరింది. జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా తిరిగి పారిస్ ఒప్పందంలో చేరడంపై ప్రపంచ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, బాధ్యతలు చేపట్టిన రోజే పారిస్ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరుతుందని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై తొలిరోజే సంతకం చేశారు. దీంతో శుక్రవారం (ఫిబ్రవరి 19)నుంచి అధికారికంగా పారిస్ ఒప్పందంలో అమెరికా చేరినట్లు అయ్యింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసిన నెల రోజులకే అమెరికా ఈ ఒప్పందంలో చేరడం విశేషం.
ట్రంప్ అధికారంలోకి రాగానే..
భూతాపాన్ని తగ్గించే లక్ష్యంతో ఒకేతాటిపై వచ్చిన ప్రపంచ దేశాలు 2015 పారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్నాయి. ఒబామా పదవీ కాలం చివర్లో దీనిలో చేరిన అమెరికా, ట్రంప్ అధికారంలోకి రాగానే ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఒప్పందం ప్రకారం, ఒకవేళ ఏదైనా దేశం దీని నుంచి వెళ్లపోవడం, లేదా తిరిగి చేరే వీలుంది. పారిస్ ఒప్పందానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన బైడెన్ ప్రభుత్వం అందుకు తగినట్లుగానే ఒప్పందంలో మళ్లీ చేరింది.
ఐక్యరాజ్య సమితి హర్షం..
పారిస్ పర్యావరణ ఒప్పందంలో అమెరికా మళ్లీ చేరడం ఎంతో ముఖ్యమైన విషయమని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు ఇది నిజంగా రాజకీయ సందేశమేనని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగాధిపతి క్రిస్టియానా ఫిగరెస్ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం నుంచి అమెరికానే వెళ్లిపోవడంతో, అదే దారిలో మరిన్ని దేశాలు వెళతాయనే ఆందోళన ఉన్నప్పటికీ ఏ దేశం కూడా ఆ దిశగా అడుగులు వేయలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించడంలో అమెరికా ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలవాల్సి ఉందని ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు.