ప్రభుత్వ మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా తప్పుడు సమాచారవ్యాప్తికి పాల్పడుతున్న ఖాతాలను సామాజికమాధ్యమ దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్లు నిలివిపేశాయి. తమ నియమాలను ఉల్లంఘించిన సౌదీ అరేబియా ప్రభుత్వ మద్దతున్న 88,000 ఖాతాలను నిలిపివేసినట్లు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రకటించింది. అందులో 5,929 ఖాతాలను ప్రతినిథి నమూనాలుగా పేర్కొన్న ట్విట్టర్.... వాటి వివరాలను విడుదల చేసినట్లు తెలిపింది.
ఖాతాలన్ని సౌదీలోని సోషల్ మీడియా మార్కెటింగ్ సంస్థ 'స్మాట్' సమన్వయంతో నడుస్తున్నట్లు ట్విట్టర్ గుర్తించింది. దీంతో స్మాట్ను పూర్తిగా ట్విట్టర్ నుంచి బ్లాక్ చేసినట్లు స్పష్టం చేసింది. ట్రంప్‌నకు అనుకూలంగా, ట్రంప్ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది.
ఫేస్బుక్ సైతం...
నియమాలు ఉల్లంఘించిన ఖాతాలను తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అనుకూలంగా పోస్ట్‌లు చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. తప్పుడు సమాచార వ్యాప్తి, స్పామ్, అనధికార ప్రవర్తన వంటి పాలసీలను ఉల్లంఘించినందుకు 600కు పైగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపింది. అమెరికా పౌరులే లక్ష్యంగా వియత్నాం, అమెరికా, జార్జియా దేశాల్లో ట్రంప్‌నకు అనుకూలంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారని ఫేస్బుక్ వెల్లడించింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోన్న పలు ఖాతాలను ఆటోమెటిక్ సిస్టమ్ తొలగించినట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ మద్దతుతో సమాచార వ్యాప్తికి పాల్పడుతున్న ఖాతాలను గుర్తించడానికి ఫేస్బుక్, ట్విట్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ఆటోమేటెడ్ రోబోలను ఉపయోగించి తమ సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రత్యర్థుల సమాచార వ్యాప్తిని నిరోధించేలా ప్రభుత్వ అనుకూల వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
అవకతవకలు రెట్టింపు
56 దేశాల్లో సమాచార వ్యాప్తిలో అవకతవకల యత్నాలు గత రెండేళ్లలో రెట్టింపు అయినట్లు 'ఆక్స్ఫర్డ్ ఇంటర్నెట్ ఇన్స్టిట్యూట్' నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఏడు దేశాల వ్యక్తులు ప్రభుత్వ మద్దతుతో ఇతర దేశాలపై ప్రభావం చూపే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆ పరిశోధనలో వెల్లడైంది. అందులో చైనా, భారత్, ఇరాన్, పాకిస్థాన్, రష్యా, సౌదీ అరేబియా, వెనుజులా దేశాలు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.