తాలిబన్ ఆక్రమిత అప్గానిస్థాన్(Taliban Afghanistan) నుంచి ప్రజలను తీసుకువచ్చే ప్రక్రియలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe biden) అనుసరిస్తున్న విధానంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజలతో పాటు.. వేలాది మంది ఉగ్రవాదులు.. అఫ్గాన్ నుంచి బయటకు వెళ్లి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది బైడెన్ ఘోర వైఫల్యం అని పేర్కొన్నారు.
"అప్గానిస్థాన్‌ను ఉగ్రవాదులకు బైడెన్ అప్పజెప్పారు. ప్రజల కంటే ముందు సైన్యాన్ని తరలించి, వేలాది మంది అమెరికన్ల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఇప్పటివరకు 26,000 మందిని తరలించారని వింటున్నాం. అందులో 4,000 మంది మాత్రమే అమెరికన్లు. తరలింపు విమానాల్లో ఉగ్రవాదులు లేకపోయి ఉంటే.. ఇంతమందిని తాలిబన్లు ఎందుకు అనుమతిస్తారు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
'అప్గాన్ నుంచి ఎంతమందిని తరలించారనే దానికంటే ఎన్నివేల మంది ఉగ్రవాదులను అమెరికాకు, ఇతర దేశాలకు తరలించారనే విషయంపై మనం ఆలోచించాలి. ఘోరమైన వైఫల్యం ఇది. ఎంతమంది ఉగ్రవాదులను బైడెన్.. అమెరికాకు తీసుకువస్తారో మనకు తెలియదు' అని ట్రంప్ పేర్కొన్నారు.
బైడెన్‌పై తీర్మానం
అఫ్గాన్ తరలింపు విషయంలో బైడెన్ విఫలమయ్యారని పేర్కొంటూ రిపబ్లికన్ సభ్యుడు మైక్ వాల్ట్.. అమెరికా ప్రతినిధుల సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. తాలిబన్ల విషయంలో సైనిక, నిఘా వర్గాలు ఇచ్చిన సలహాలను బైడెన్ పట్టించుకోకుండా వ్యవహారించారని పేర్కొన్నారు. ఫలితంగా అమెరికా విశ్వసనీయతకు తీరని నష్టం వాటిల్లిందని తెలిపారు.
అప్పుడే గుర్తిస్తాం..
మరోవైపు.. ఉగ్రవాదానికి అఫ్గానిస్థాన్ కేంద్రం కాకుండా చూస్తేనే భవిష్యత్‌లో అక్కడి ఏ ప్రభుత్వానికైనా తాము చట్టబద్ధత కల్పిస్తామని జో బైడెన్ తెలిపారు. జీ7 దేశాలన్నీ ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయని పేర్కొన్నారు. మంగళవారం అఫ్గాన్ పరిస్థితులపై జీ7 దేశాధినేతలు(G7 leaders meeting on Afghanistan) నిర్వహించిన వర్చువల్ సమావేశం అనంతరం ఈ మేరకు బైడెన్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: Canada: 'అమెరికా వైదొలిగినా.. అఫ్గాన్‌లోనే మా బలగాలు'
ఇదీ చూడండి: తాలిబన్ల చేతికి 15 లక్షల మంది బయోమెట్రిక్ డేటా!