అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అయితే, ఈసారి ఆయన చిక్కుకున్నది మామూలు అంశం కాదు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించిన వ్యాక్సిన్‌ను హస్తగతం చేసుకొనేందుకు కుట్ర పన్నారని ఐరోపా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ప్రముఖ పత్రిక 'డై వెల్ట్' ప్రచురించిన కథనం ఇప్పుడు కీలకమైంది.
ఐరోపా మీడియా కథనాల ప్రకారం.. జర్మనీలోని 'క్యూర్‌వ్యాక్' అనే ఔషధ పరిశోధన సంస్థ కరోనా వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్ పరిశోధనల్లో కొంత పురోగతి కూడా సాధించింది. దీన్ని పసిగట్టిన ట్రంప్, ఆయన పాలకవర్గం దీన్ని హస్తగతం చేసుకోవాలని భావించారు. అందుకు భారీగా డబ్బు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు. తద్వారా దాన్ని తమ దేశానికి తరలించి వ్యాక్సిన్ హక్కుల్ని కేవలం అమెరికాకే పరిమితం చేసుకోవాలని భావించినట్లు పత్రికల్లో ఆరోపించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో 'క్యూర్‌వ్యాక్' చీఫ్ ఎగ్జిక్యూటివ్ గత నెల భేటీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చింది. జూన్ లేదా జులై నాటికి కరోనాను అరికట్టే ప్రయోగాత్మక వ్యాక్సిన్‌ను తయారు చేస్తామని 'క్యూర్‌వ్యాక్' గతవారం ప్రకటించింది. తాజా ఆరోపణల్ని జర్మనీ ఆరోగ్యశాఖ మంత్రి ధ్రువీకరించడం గమనార్హం. దీంతో 'క్యూర్‌వ్యాక్' జర్మనీ నుంచి తరలిపోకుండా చూసేందుకు అక్కడి ప్రభుత్వం రంగంలోకి దిగిందట. పరిశోధనకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వమే ముందుకు వచ్చినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'యోగా చేస్తే కరోనా కలవరపెట్టదు!'