అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత పోలీసింగ్ విధానాల్లో మార్పుల దిశగా అడుగులు వేశారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో సంస్కరణలకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు ట్రంప్.
"ఈ రోజు దేశ వ్యాప్తంగా పోలీసు శాఖకు చెందిన అత్యున్నత వృతిపరమైన ప్రమాణాలకు సంబంధించిన కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకం చేశాను. ఈ ప్రమాణాలు ప్రపంచంలోనే ఎంతో శక్తివంతంగా, ఉన్నతంగా ఉంటాయి. పోలీస్ అధికారుల్లో ఎక్కువ మంది నిస్వార్థంతో, ధైర్య సాహసాలతో ప్రజలకు సేవ చేస్తున్నారు."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
"విధులు నిర్వహిస్తున్న మహిళలు, పురుషులు చాలా గొప్పవాళ్లు. ఎవరైనా ప్రమాదం నుంచి పారిపోతుంటే పోలీసులు మాత్రమే ఎదురు నిలబడి ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. తరచూ తమకు తెలియని, ఎన్నడూ కలుసుకోని వారిని రక్షించటానికి ప్రాణాలను కూడా లెక్క చేయరు" అన్నారు ట్రంప్
కొంత మంది పోలీసు వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలపై ట్రంప్ మండిపడ్డారు. గతంతో పోలిస్తే ఇప్పుడే తక్కువ నేరాలు జరిగాయి అని ఉద్ఘాటించారు. అమెరికా పౌరులు, అధికారులు మధ్య సానుకూల, శాశ్వత సంబంధాలను మెరుగుపరచటానికి, బలోపేతం చేయటానికి ఈ ఆర్డర్ ఎంతో ఉపయోగపడుతుందని శ్వేతసౌధ అధికారులు అభిప్రాయపడ్డారు.
అలాగే పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను స్వయంగా కలిశారు ట్రంప్. "మీరు ప్రేమించే వారు మరణించారు. మీ బాధను, వేదనను నేను ఊహించలేను. కానీ ప్రజల తరఫున న్యాయపోరాటం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను." అని ట్రంప్ అన్నారు.
ఇదీ చూడండి:ప్రపంచ యుద్ధంకన్నా కరోనాకే ఎక్కువ మంది బలి