జాతి వివక్షకు బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ అంత్యక్రియలు.. అక్కడి కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు జరగనున్నాయి. హ్యూస్టన్లోని మెమోరియల్ గార్డెన్స్ శ్మశాన వాటికలోని అతని తల్లి లార్సేనియా సమాధి పక్కనే ఫ్లాయిడ్ మృతదేహాన్ని ఖననం చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హిల్క్రాఫ్ట్ అవెన్యూలోని ద ఫౌంటెన్ ఆఫ్ ప్రెయిస్ చర్చిలో ఫ్లాయిడ్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఆయనకు నివాళి అర్పించేందుకు చర్చి వద్దకు చేరారు.


పరామర్శలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ సోమవారం హ్యూస్టన్ వెళ్లి జార్జి ఫ్లాయిడ్ కుటుంబాన్ని పరామర్శించారు. నల్లజాతి ప్రజలపై పోలీసుల దౌర్జన్యాలకు అడ్డుకట్టవేస్తూ పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తెస్తామని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు.
డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బిడెన్.. ఫ్లాయిడ్ కుటుంబాన్ని కలిసి పరామర్శిస్తారని సమాచారం. మరోవైపు హారిస్ కౌంటీ జూన్ 9ను అధికారికంగా జార్జి ఫ్లాయిడ్ డేగా ప్రకటించింది.
ఆ పోలీసుకు బెయిల్

గత నెల 25న మిన్నియాపోలిస్ పోలీస్ అధికారి డెరెక్ చావిన్ దాష్టీకం కారణంగా ఫ్లాయిడ్ మరణించారు. అయితే ఫ్లాయిడ్ మరణానికి కారణమైన మిన్నియాపొలిస్ పోలీసు అధికారి డెరెక్ చావిన్‌కు సోమవారం ఒక మిలియన్ డాలర్ల పూచీకత్తులో హెన్నెపిన్ కౌంటీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
నిరసనలు - అరెస్టులు
ఫ్లాయిడ్ మరణించిన తరువాత అమెరికావ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు ఇప్పుడు శాంతియుత ప్రదర్శనలుగా మారిపోయాయి. పోలీసు వ్యవస్థలో సంస్కరణలే లక్ష్యంగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. మరోవైపు పోలీసులు కూడా నిరసనకారుల పట్ల సంయమనం పాటిస్తున్నారు.

ఫ్లాయిడ్తో ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును నిరసిస్తూ .. మిన్నియాపొలిస్ సిటీ కౌన్సిల్ సభ్యులు మొత్తం పోలీసు విభాగాన్నే రద్దు చేయాలని తీర్మానించారు.

ఫ్లాయిడ్ మరణం తరువాత దేశవ్యాప్తంగా హింసాయుత నిరసనలు చెలరేగాయి. దీనితో పోలీసులు సుమారు 10 వేల మందికిపైగా ఆందోళనకారులను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: న్యూయార్క్ పునఃప్రారంభం.. కొన్ని రంగాలకే అనుమతి