మెక్సికో సరిహద్దు వెంబడి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన గోడ నిర్మాణానికి ఆ దేశ రక్షణ శాఖ-పెంటగాన్ నిధులు వినియోగించుకోవచ్చని అక్కడి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో రక్షణ శాఖ నిధుల నుంచి దాదాపు 2.5 బిలియన్ డాలర్లు గోడ నిర్మాణానికి ఉపయోగించవచ్చు. అంతకుముందు మే నెలలో నిధుల్ని స్తంభింపజేసిన ట్రయల్ కోర్టు తీర్పునకు సుప్రీం పూర్తి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంది.
ఇదీ చూడండి: 'గోడనిర్మాణానికి సైనిక నిధులు వాడొద్దు'
సుప్రీం నిర్ణయంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక గొప్ప విజయమని ట్వీట్ చేశారు.
''వావ్..! గోడ నిర్మాణం విషయంలో ఇది పెద్ద విజయం. దిగువ కోర్టు విధించిన నిషేధాన్ని అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. దక్షిణాన గోడ నిర్మాణానికి అనుమతించింది. సరిహద్దు భద్రత, చట్ట నియమాల అమలు కోసం ఇది గొప్ప గెలుపు.''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఈ తీర్పుతో రెండోసారి అమెరికా అధ్యక్ష రేసులో నిలుస్తోన్న ట్రంప్‌నకు అవకాశాలు మరింత మెరుగయ్యాయి. 2016 ఎన్నికల ముందు మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మిస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా కనిపిస్తున్నారు.
మొదటి నుంచీ గోడ నిర్మాణంలో ట్రంప్ ప్రభుత్వానికి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అంతకుముందు.. దిగువ కోర్టుల న్యాయమూర్తులు గోడ నిర్మాణానికి అడ్డుతగిలారు. ప్రాజెక్టుల నిధుల కేటాయింపును స్తంభింపజేశారు. ఇటీవలే ఓక్లాండ్ కోర్టు.. గోడ నిర్మాణం కోసం సైనిక నిధుల నుంచి 250 కోట్ల డాలర్లు ఉపయోగించుకోవాలన్న ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది.
తాజాగా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నిర్ణయంతో నాలుగు కాంట్రాక్టుల నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఫలితంగా.. మరోసారి అధ్యక్ష రేసులో బలమైన పోటీదారుగా మారనున్నారు డొనాల్డ్ ట్రంప్.
సంక్షోభం నుంచి...
ఈ ఏడాది ప్రారంభంలో మెక్సికో గోడ నిర్మాణం అంశంతో అగ్రరాజ్యంలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. నిధుల కేటాయింపు ఆలస్యం కారణంగా 2018 డిసెంబర్లో మొదలైన ప్రభుత్వ పాక్షిక మూసివేత 35 రోజుల పాటు కొనసాగింది. అనంతరం.. జాతీయ అత్యయిక పరిస్థితినీ విధించారు.