గాలిని బయటకు విడుదల చేయడానికి ఏర్పాటు చేసే వాల్వుల వల్ల మాస్కుల ఉద్దేశం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. కొవిడ్-19ను కట్టడి చేయడంలో ఇవి పెద్దగా ఉపయోగపడబోవని ఆధారాలతో సహా రుజువైంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ(ఎన్ఐఎస్టీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.
శాస్త్రవేత్తలు వాల్వులు లేని, ఉన్న మాస్కుల్లో గాలి ప్రవాహాన్ని వివరించే పలు వీడియోలను సృష్టించారు. ఇందులో మొదటి వీడియోను స్క్లిరియన్ ఇమేజింగ్ వ్యవస్థను ఉపయోగించారు. ఇది గాలి సాంద్రతలోని వైరుధ్యాలను వెలుగు, నీడల్లా చూపుతుంది. రెండో వీడియోలో లైట్ స్కాటరింగ్ సాంకేతికతను ఉపయోగించారు. ఇది వాల్వుల ద్వారా వెలువడే చిన్నపాటి తుంపర్లను పసిగడుతుంది. ఈ రెండు రకాల వీడియోలను పక్కపక్కనే పెట్టి పోల్చి చూశారు. వాల్వులు ఉన్న, లేని మాస్కుల మధ్య వైరుధ్యాలను పరిశీలించారు. వీటి మధ్య చాలా తేడాలు ఉన్నట్లు వెల్లడైందని మాథ్యూ స్టేమేట్స్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వాల్వుల వల్ల.. మాస్కుల నుంచి వడకట్టని గాలి వెలువడుతోందని చెప్పారు.