అత్యవసర ఆరోగ్య పరిస్థితి ఉత్పన్నమైన మొదటి గంటలో రోగికి అందే వైద్య సహాయం అత్యంత కీలకమైనది. ఈ సమయాన్ని బంగారు ఘడియగా వైద్యులు పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల మేరకు విశ్వవ్యాప్తంగా రహదారి ప్రమాదాల వల్ల ఏటా అయిదు కోట్ల మంది గాయాల పాలవుతున్నారు. వీరిలో 12 లక్షల మంది మరణానికి గురవుతున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఏటా లక్షల మంది రోడ్డు ప్రమాదాలతో గాయాల పాలవుతుండగా, అందులో పెద్ద సంఖ్యలోనే మృత్యువాత పడుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
మొదటి గంటలోనే..
మనదేశంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడిన వారిలో దాదాపు 80 శాతం మొదటి గంటలోనే ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. వేగంగా స్పందించాల్సిన ప్రమాద సమయంలో ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, ఆంబులెన్స్ వంటి రవాణా సౌకర్యాలు సమయానికి అందక ఆసుపత్రికి చేరుకునే లోపు 9.5 శాతం బాధితులు విగత జీవులవుతున్నట్లు రెడ్‌క్రాస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఆ నిమిషాలే కీలకం..
ప్రథమ చికిత్స పూర్తిస్థాయి వైద్యం కాకపోయినా, ఆపదలో ఉన్న వ్యక్తికి ఎంతో అమూల్యమైనది. మనిషి శ్వాస ఆగిన నాలుగు నిమిషాలకు హృదయ స్పందన నిలిచిపోతుంది. నాలుగు నుంచి ఆరు నిమిషాలు శ్వాస ఆగితే మెదడు శాశ్వతంగా దెబ్బ తింటుంది. రహదారి ప్రమాదాల్లో 50 శాతం మరణాలు మొదటి కొద్ది నిమిషాల్లోనే సంభవిస్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సమయస్ఫూర్తితో చాకచక్యంగా ప్రథమ చికిత్సను అందించినట్లయితే ప్రాణనష్టాన్ని 59శాతం వరకు నివారించవచ్చని రెడ్‌క్రాస్ స్పష్టం చేస్తోంది.
ప్రథమ చికిత్స మనిషి ప్రాణాలను కాపాడి, ఆరోగ్యం మరింతగా క్షీణించకుండా చేసి త్వరగా కోలుకునేందుకు తోడ్పడుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. శ్వాసకోశాలను శుభ్రపరచి, ఊపిరిని పునరుద్ధరించడం, గుండెను స్పందింపజేసి రక్త ప్రసరణకు పునరుత్తేజం కలిగించడం ప్రథమ చికిత్సలో అత్యంత కీలకం. ఆకస్మిక గుండెపోటుకు గురైన వారిలో 92శాతం ఆసుపత్రికి చేరే లోపు మృత్యువాత పడుతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. ఇలాంటి తరుణంలో గుండెను వెనువెంటనే ప్రతిస్పందింప చేయలేకపోతే రోగి బతికే అవకాశాలు నిమిషానికి ఏడుశాతం చొప్పున సన్నగిల్లుతున్నట్లు పేర్కొంది. గుండె, శ్వాసనాళాలకు పునరుత్తేజాన్ని కలిగించే సీపీఆర్ పద్ధతిలో ప్రథమ చికిత్సను అందిస్తే రోగి కోలుకునే అవకాశాలు రెండింతలు మెరుగవుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మూర్ఛ వ్యాధులు, విష ప్రయోగం, పాము కాటు వంటివి ఇతర ముఖ్య ఆరోగ్య అత్యవసర పరిస్థితులు. గృహ దహనాలు, బాంబు పేలుళ్లు, వరదలు, విద్యుదాఘాతం, కర్మాగారాల నుంచి వెలువడే విష వాయువులు వంటి ప్రమాదాలు మూకుమ్మడి అత్యవసర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 కోట్ల మందికి ప్రథమ చికిత్సపై అవగాహన కల్పిస్తూ ప్రాణదాతల్ని అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉంది. నార్వేలో 95 శాతం, జర్మనీ, ఆస్ట్రియాలలో 80 శాతం, ఐస్‌లాండ్‌లో 75 శాతం ప్రథమ చికిత్సలో నిష్ణాతులై ఉండటం గమనార్హం. ఈ దేశాలు ప్రమాదాలు నెలకొన్నప్పుడు అందించే సేవల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు అక్కడి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. జనాభా 135 కోట్లకుపైబడి, పెద్ద సంఖ్యలో నిరక్షరాస్యులతో, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యరంగంలో మౌలిక వసతుల లేమి వంటి సమస్యలతో సతమతమవుతున్న మన దేశంలో ప్రథమ చికిత్సపై అవగాహన, శిక్షణ అత్యావశ్యకమని గుర్తించాలి.
అందరికీ శిక్షణ అవసరం..
ప్రజల జీవన విధానంలో ప్రథమ చికిత్స అంతర్భాగంగా మారాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంలో నేటితరం చిన్నారులు, యువతకు శిక్షణ అందించి మెరుగ్గా తీర్చిదిద్దితే వారు తమను తాము రక్షించుకుంటూ, కుటుంబాలను, స్నేహితులను, వృద్ధులను, తోటివారిని కాపాడే అవకాశం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ప్రాథమిక జీవ రక్షణపై సుశిక్షితులై ఉండాలి. సీపీఆర్ వంటి ప్రక్రియలను సమర్థంగా నిర్వహించగలగాలి. ప్రమాదం వాటిల్లినప్పుడు సకాలంలో సహాయం అందగలదనే ధీమా ప్రతి మనిషికీ కలగాలి. విద్యార్థులు, వాహన చోదకులకు ప్రథమ చికిత్సపై నైపుణ్యం పెంచుకోవడాన్ని నిర్బంధం చేయాలి. విద్యాలయాలు, కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, పార్కులు వంటి జన సమర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ప్రథమ చికిత్సకు అనుకూలమైన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రథమ చికిత్స పెట్టె, అగ్నిమాపక యంత్రం, డీఫిబ్రిలేటర్ వంటి ఉపకరణాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. ఆధునిక జీవన శైలికి, వైద్య ప్రమాణాలకు అనుగుణంగా ప్రథమ చికిత్స మెలకువలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండాలి. ప్రాణప్రదమైన ప్రథమ చికిత్సకు ప్రాధాన్యం కల్పించడంలో వైద్యులు, నేతలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు, యువత, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలి. అప్పుడే అందరి ప్రాణాలనూ కాపాడుకోవడం సులభ సాధ్యమవుతుంది.
- డాక్టర్ జెడ్.ఎస్.శివప్రసాద్ (వైద్య రంగ నిపుణులు)