అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన హయాంలో చేపట్టిన చర్యలను నూతన అధ్యక్షుడు జో బైడెన్ ఒక్కొక్కటిగా మారుస్తూ వస్తున్నారు. అయితే అధ్యక్ష కార్యాలయం 'ఓవెల్ ఆఫీస్'లోనూ పలు మార్పులు తీసుకొచ్చారు బైడెన్. మార్పులు జరిగిన తర్వాత ట్రంప్ 'సోడా బటన్' మాయం అయిపోయింది. ఈ వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ నడుస్తోంది. అసలు ఏంటి ఈ 'సోడా బటన్?'
డైట్ కోక్ కోసం..
ఓవెల్ ఆఫీస్లో ట్రంప్ టేబుల్ మీద ఫోన్, పుస్తకాలు, దస్త్రాలు ఉండేవి. వాటితో పాటు ఓ చెక్క బాక్సు కూడా ఉండేది. దాని మీద ఎర్రటి రంగులో ఓ బటన్ ఉండేది. ఎప్పుడైనా డైట్ కోక్ కావాలనుకుంటే ఆ బటన్ను నొక్కేవారు ట్రంప్. శ్వేతసౌధానికి చెందిన సిబ్బంది వెంటనే ఆయనకు సోడా తీసుకొచ్చి ఇచ్చేవారు.
ఈ విషయాన్ని 2017లో ట్రంప్.. స్వయంగా పలు వార్తా సంస్థలకు వెల్లడించారు. అప్పటి నుంచి అనేక మార్లు ట్రంప్ ఫొటోల్లో ఆ సోడా బటన్ దర్శనమిచ్చింది.
తాజాగా ఈ బటన్ను బైడెన్ తొలిగించినట్టు తెలుస్తోంది. ఓవల్ ఆఫీస్లో అధ్యక్షుడికి సంబంధించి ఇప్పటివరకు బయటకు వచ్చిన ఫొటోల్లో ఆ బటన్, చెక్క బాక్సు కనపడలేదు. ఆయన టేబుల్ మీద రెండు ఫోన్లు, కాఫీ కప్పు, పెన్నులు దర్శనమిచ్చాయి.
ఒబామా కూడా..
అయితే ఈ సోడా బటన్ను ట్రంప్ ఒక్కరే ఉపయోగించలేదు. గతంలో ఒబామా కూడా ఆ బాక్సుతో కనపడ్డారు.
ఇదీ చూడండి:- ట్రంప్ 'గోడ' నిర్మాణానికి బైడెన్ బ్రేకులు