అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా క్వాడ్ దేశాధినేతలకు ప్రత్యేకమైన కానుకలు (Modi Gift) ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత ప్రభుత్వంలో పనిచేసిన కమల తాత పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్ల ప్రతిని హస్తకళతో చేసిన చెక్క ఫ్రేమ్‌లో కమలకు బహూకరించారు మోదీ. ప్రభుత్వాధికారిగా గోపాలన్ వివిధ హోదాల్లో పనిచేశారు.

భారతీయ హస్తకళ..
దాంతో పాటే గులాబీ 'మీనాకారి' చెస్ సెట్‌ను కూడా హారిస్‌కు (Kamala Harris News) కానుకగా ఇచ్చారు మోదీ. ఈ మీనాకారి కళకు, మోదీ నియోజకవర్గమైన కాశీకి దగ్గరి సంబంధం ఉంది. ఈ చెస్ సెట్ కూడా హస్తకళాకారులు చేసిందే.
శ్వేతసౌధంలో కమలతో గురువారం భేటీ అయిన మోదీ (Modi US Visit).. అమెరికా-భారత్ సహజసిద్ధ భాగస్వాములని అభివర్ణించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపారు. దేశంలో కరోనా రెండో దశ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో సహకరించిన అమెరికాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా(Modi Us Visit 2021) కమలా హారిస్‌ను ప్రధాని మోదీ భారత పర్యటనకు ఆహ్వానించారు.
మీనాకారి పడవ..
తొలిసారి నేరుగా నిర్వహిస్తున్న క్వాడ్ సదస్సులో (QUAD Summit 2021) పాల్గొనేందుకు అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌తో భేటీ అయ్యారు. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చుకోవడం వంటి అంశాలపై వారు చర్చించారని ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్ వేదికగా తెలిపింది.

ఈ సందర్భంగా మోరిసన్‌కు వెండి గులాబీ మీనాకారి పడవను కానుకగా ఇచ్చారు మోదీ. హస్తకళతో చేసిన ఈ పడవ కూడా కాశీ విశిష్టతను తెలియజేసేలా ఉంటుంది.
బౌద్ధం గుర్తుగా..
జపాన్ ప్రధాని యోషిహిదే సుగాకు గంధపు చెక్కతో చేసిన బుద్ధ విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు మోదీ. భారత్, జపాన్ను దగ్గర చేయడంలో బౌద్ధం కీలక పాత్ర పోషించింది.

సుగాతో భేటీ సందర్భంగా ఇండో పసిఫిక్ ప్రాంతం, ప్రాంతీయ పరిణామాలు, సరఫరా గొలుసులో స్థిరత్వం, వాణిజ్యం, డిజిటల్ ఎకానమీ వంటి అంశాలపై చర్చ జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాత్రికి బైడెన్‌తో భేటీ..
శుక్రవారం రాత్రి 8.30 గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం శ్వేతసౌధంలో జరగనుంది. వీరి భేటీ గంటసేపు కొనసాగనుంది. ఆ తర్వాత మోదీ పర్యటన ఇలా సాగనుంది.
ఇదీ చూడండి: 'ఉగ్రవాదానికి కేంద్రంగా పాకిస్థాన్.. పర్యవేక్షణ అవసరం'