అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ రాకపోయినప్పటికీ.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరుకానున్నట్లు సమాచారం. ఆది నుంచి పెన్స్ ఈ కార్యక్రమానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఆహ్వానం కోసం వేచిచూస్తున్నారని శ్వేతసౌధంలోని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మరోవైపు పెన్స్ రావాలని బైడెన్ సైతం కోరుకున్నారు. ఆయన రాకను గౌరవంగా భావిస్తానని శుక్రవారం తెలిపారు.
బైడెన్ గెలుపును కాంగ్రెస్ ధ్రువీకరించే సమయంలో ట్రంప్ నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ.. పెన్స్ నిబంధనలకు కట్టుబడి నడుచుకున్నారు. ఫలితాలు తారుమారు చేయాలని ట్రంప్ పరోక్షంగా ఆదేశించినప్పటికీ.. పెన్స్ అందుకు నిరాకరించారు. చివరకు ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. అయినా సరే పెన్స్.. ట్రంప్‌నకు ఏమాత్రం మద్దతుగా నిలవలేదు. తొలి నుంచి ట్రంప్‌నకు విధేయుడిగా ఉన్న ఆయన.. చివర్లో రాజ్యాంగానుబ్ధంగా నడుచుకొని అందరి మన్ననలు పొందారు. ట్రంప్ కుయుక్తుల్ని తిప్పికొట్టారు.
ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి 20న జరగబోయే బైడెన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాబోనని ట్రంప్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారానికి.. ప్రస్తుత అధ్యక్షుడు రానంటూ బహిరంగంగా తోసిపుచ్చడం 152 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. దీనిపై బైడెన్ స్పందిస్తూ..''ట్రంప్ రాకున్నా ఫర్వాలేదు.. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వస్తే చాలు. ఆయన రాకను ఎంతో గౌరవంగా భావిస్తా'' అని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఇదీ చూడండి: మూణ్నెళ్లా.. ఆర్నెళ్లా.. రెండేళ్లా? ఏ టీకా పవరెంత?