అగ్రరాజ్యంలో కరోనా ఉద్ధృతితో ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 24 గంటల వ్యవధిలో 7.21 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. మరోసారి 10వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 20.69 కోట్లకు పెరిగింది. మరణాల సంఖ్య 43.57 లక్షలకు చేరింది.
అమెరికాలో 24 గంటల వ్యవధిలో లక్షన్నరకుపైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. 769 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3.73 కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 6.37 లక్షలు దాటింది. అనేక రాష్ట్రాల్లోని ఆస్పత్రులన్నీ కొవిడ్ రోగులతో నిండిపోయాయి.
వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో చాలా వరకు ప్రజలు టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మిగిలిన వారు వ్యాక్సినేషన్ పట్ల అనాసక్తి ప్రదర్శించడమూ కేసులు పెరగేందుకు కారణమని అంటున్నారు. టీకా తీసుకోని వారిలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పారు
సెల్ఫ్ బూస్టర్!
మరోవైపు, అమెరికాలో బూస్టర్ డోసు వినియోగాన్ని అధికారికంగా ఆమోదించడానికి ముందే 11 లక్షల మందికి పైగా అదనపు డోసును తీసుకున్నారని తెలుస్తోంది. మోడెర్నా, ఫైజర్ టీకాలు తీసుకున్న 11 లక్షల మంది అదనంగా మూడో డోసును స్వయంగా వేయించుకున్నారని అధికారులు తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు టీకా తీసుకున్నవారిలో 90 వేల మంది అదనంగా రెండో డోసును స్వీకరించారని చెప్పారు. రోగనిరోధనక శక్తి తక్కువగా ఉన్నవారే బూస్టర్ డోసులు తీసుకున్నారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని వెల్లడించారు.
ఇక ఇతర దేశాల్లోనూ కరోనా విజృంభణ ఆందోళనకరంగానే ఉంది. ఇరాన్, బ్రెజిల్లో కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇండోనేసియాలో కరోనా.. మరణ మృదంగం మోగిస్తోంది.
కేసులు అధికంగా నమోదైన దేశాలు
- అమెరికా: 155,297
- ఇరాన్: 39,119
- బ్రెజిల్: 33,933
- బ్రిటన్: 32,700
- ఇండోనేసియా: 30,788
- ఫ్రాన్స్: 26,453
ఈ దేశాల్లోనే మరణాలు అధికం
- ఇండోనేసియా: 1,432
- బ్రెజిల్: 926
- రష్యా: 815
- అమెరికా: 769
- మెక్సికో: 608
- ఇరాన్: 527
- దక్షిణాఫ్రికా: 384